పాక్​–ఇంగ్లండ్​ వన్డే సిరీస్​: ఇంగ్లిష్​ జట్టులో ఏడుగురికి కరోనా

  • ముగ్గురు ఆటగాళ్లు.. నలుగురు సిబ్బందికి పాజిటివ్
  • కాసేపట్లో కొత్త టీమ్ ప్రకటన
  • బెన్ స్టోక్స్ కు జట్టు పగ్గాలు
  • వెల్లడించిన ఈసీబీ
ఇంగ్లండ్ జట్టులోని ఏడుగురు సభ్యులకు కరోనా సోకిందని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) ప్రకటించింది. పాకిస్థాన్ తో జరగబోయే రాయల్ లండన్ వన్డే సిరీస్, వైటాలిటీ టీ20 సిరీస్ కు ఎంపిక చేసిన జట్టులోని సభ్యులు మహమ్మారి బారిన పడ్డారని వెల్లడించింది. కరోనా సోకిన వారిలో ముగ్గురు ఆటగాళ్లు కాగా.. నలుగురు సపోర్టింగ్ స్టాఫ్ అని పేర్కొంది.

ఇంగ్లండ్ ఆరోగ్య శాఖ, వేల్స్ ఆరోగ్యశాఖ, బ్రిస్టల్ లోని స్థానిక వైద్య ఆరోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణలో జులై 4 నుంచే జట్టు సభ్యులు క్వారంటైన్ లో ఉంటున్నారని, ప్రొటోకాల్ క్వారంటైన్ ప్రకారం వారంతా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉంటారని స్పష్టం చేసింది. వారికి క్లోజ్ కాంటాక్ట్స్ అయిన మిగతా జట్టు సభ్యులకూ ఐసోలేషన్ తప్పనిసరి అని పేర్కొంది.

దీంతో పాకిస్థాన్ తో తలపడబోయే కొత్త జట్టును కాసేపట్లో ప్రకటిస్తామని తెలిపింది. బెన్ స్టోక్స్ జట్టు పగ్గాలు అందుకుంటాడని తెలిపింది. అంతకుముందు ఆటగాళ్లందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పింది.

కాగా, ప్రస్తుతం డెల్టా వేరియంట్ తో కరోనా కేసులు పెరుగుతున్నాయని ఈసీబీ సీఈవో టామ్ హారిసన్ అన్నారు. బయో సెక్యూర్ బబుల్ ను ఎంత పటిష్ఠంగా అమలు చేసినా.. కేసులు వస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం ఏడుగురు సభ్యులకు కరోనా సోకడంతో రాత్రికిరాత్రే కొత్త టీమ్ పై కసరత్తులు చేశామన్నారు.


More Telugu News