ఏపీ సీఎస్ ఆదిత్య‌నాథ్ దాస్‌కు టీడీపీ నేత వ‌ర్ల రామ‌య్య లేఖ

  • సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌పై ద‌ర్యాప్తును త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాలి
  •  అప్ర‌ధాన పోస్టులో ఉంచాలి
  • లేదంటే విచార‌ణ అధికారిపై ప్ర‌భావం  
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆదిత్య‌నాథ్ దాస్‌కు టీడీపీ నేత వ‌ర్ల రామ‌య్య లేఖ రాశారు. ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌పై ద‌ర్యాప్తును త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని ఆయ‌న విన్న‌వించారు. ఆయ‌న‌పై విచార‌ణ పూర్త‌య్యే వ‌ర‌కు ఆయ‌న‌ను అప్ర‌ధాన పోస్టులో ఉంచాల‌ని ఆయ‌న కోరారు. కేంద్ర హోం శాఖ ఆదేశాల ప్ర‌కారం ఈ కేసులో విచార‌ణ నిష్ప‌క్ష‌పాతంగా జ‌ర‌గాల‌ని ఆయ‌న అన్నారు.

విచార‌ణ ఎదుర్కొంటున్న సునీల్ సీఐడీ చీఫ్‌గా ఉంటే విచార‌ణ అధికారిపై ప్ర‌భావం ప‌డుతుంద‌ని ఆయ‌న తెలిపారు. దీనిపై ఆయ‌న గ‌వ‌ర్న‌ర్‌, కేంద్ర‌హోం శాఖ‌తో పాటు ఏపీ డీజీపీకి కూడా ఫిర్యాదు చేసిన‌ట్లు చెప్పారు. కాగా, సునీల్ కుమార్‌ సర్వీస్‌ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆరోప‌ణ‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌పై విచార‌ణ జ‌రుగుతోంది.


More Telugu News