మంత్రి స‌బిత ఇంటిని ముట్ట‌డించిన విద్యార్థులు

  • ప‌రీక్ష‌లు వాయిదా వేయాల‌ని డిమాండ్
  • కుద‌ర‌ద‌న్న స‌బిత‌
  • రోడ్డుపై విద్యార్థుల బైఠాయింపు
  • ప‌లువురి అరెస్టు
హైద‌రాబాద్ శ్రీనగర్‌ కాలనీలోని తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసం వ‌ద్ద ఉద్రిక్త‌త నెల‌కొంది. క‌రోని విజృంభ‌ణ నేప‌థ్యంలో డిగ్రీ పరీక్షలను వాయిదా వేయాల‌ని, లేదంటే ఆన్‌లైన్‌లో నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు నిర‌స‌న తెలిపారు. విద్యార్థులు పూర్తి స్థాయిలో వ్యాక్సిన్‌ తీసుకోలేద‌ని, వారికి వ్యాక్సిన్లు వేసేవ‌ర‌కు పరీక్షలను వాయిదా వేయాలన్నారు.

హైద‌రాబాద్‌లోని సత్యసాయి నిగమం నుంచి మంత్రి ఇంటి వరకు విద్యార్థులు ర్యాలీగా వెళ్లడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో స‌బిత‌ జోక్యం చేసుకుని కొంద‌రు విద్యార్థులతో మాట్లాడారు. రాష్ట్రంలో ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని తాము ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని ఆమె తెలిపారు.

క‌రోనా వేళ విద్యార్థులు ఎక్కడ కోరితే అక్కడ పరీక్ష కేంద్రాలు ఉండేలా అవకాశం కల్పిస్తామన్నారు. పరీక్షలు వాయిదా వేయాల‌న్న డిమాండ్‌పై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవ‌డం కుద‌ర‌ద‌ని తెలిపారు. ఆ త‌ర్వాత ఆమె  ఇంటి నుంచి బయటికి వెళ్లారు. అయిన‌ప్ప‌టికీ అక్క‌డే రోడ్డుపై విద్యార్థులు బైఠాయించి ఆందోళ‌న తెలిపారు. దీంతో వారిని  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


More Telugu News