చైనాపై మరోసారి ప్రశంసల జల్లు కురిపించిన ఎలాన్ మస్క్

  • చైనా ఆర్థిక సంక్షేమం భేష్ అంటూ ట్వీట్
  • ఇన్ ఫ్రా రంగంలో చైనాకు తిరుగులేదని కితాబు
  • చైనా గురించి అందరూ తెలుసుకోవాలని పిలుపు
  • గత మార్చిలోనే ఇదే తరహా ట్వీట్
విద్యుత్ ఆధారిత వాహన తయారీ దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ నిత్యం ఏదో రకంగా వార్తల్లో ఉంటారు. తాజాగా, డ్రాగన్ దేశం చైనాపై మరోసారి ప్రశంసలు జల్లు కురిపించారు. ఇటీవలే చైనా అధికార కమ్యూనిస్ట్ పార్టీ 100వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు జరుపుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎలాన్ మస్క్ ప్రత్యేకంగా ట్వీట్ చేశారు.

చైనా సాధించిన ఆర్థికపరమైన సంక్షేమం నిజంగా అమోఘం అని కొనియాడారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాల రంగంలో చైనాకు తిరుగులేదని కీర్తించారు. 'అభివృద్ధి పథంలో దూసుకెళుతున్న చైనాను సందర్శించి, స్వయంగా అక్కడి పరిస్థితులను చూడాలని ప్రజలను ప్రోత్సహిస్తున్నా' అంటూ మస్క్ పేర్కొన్నారు.

గత మార్చిలోనూ మస్క్ ఇదే రీతిలో చైనాపై తన అభిమానాన్ని చాటుకున్నారు. తమ టెస్లా వ్యాపార సామ్రాజ్యానికి చైనా అతి ముఖ్యమైన విపణిగా మారనుందని పేర్కొన్నారు. చైనాలో ఎనర్జీ ఆధారిత రంగాలు ఘనతరమైనవని పేర్కొన్నారు. అక్కడి ప్రజలు ఎంతో మేధస్సు ఉన్నవారని, కష్టించి పనిచేస్తారని కితాబునిచ్చారు.

గత ఏడాదికాలంగా టెస్లా ఎలక్ట్రిక్ కార్ల వ్యాపారానికి చైనా కీలక మార్కెట్ గా మారింది. షాంఘైలో టెస్లా కార్ల తయారీ యూనిట్ ను కూడా నెలకొల్పింది. ఇటీవలే చైనాలో ఓ డేటా సెంటర్ ను కూడా ప్రారంభించింది.


More Telugu News