కాంట్రాక్టర్ల నుంచి డబ్బుల వసూళ్ల ఆరోపణలపై కర్ణాటక మంత్రి శ్రీరాములు పీఏ అరెస్ట్

  • సీఎం యడియూరప్ప కుమారుడి పేరుతో అక్రమాలు
  • పీఏ రాజణ్ణ వ్యవహారాలపై తనకేమీ తెలియదన్న మంత్రి
  • ఇలాంటి వారి వల్ల తమలాంటి వారికి చెడ్డపేరు వస్తోందన్న విజయేంద్ర
కర్ణాటక మంత్రి బి.శ్రీరాములు ఇబ్బందుల్లో పడ్డారు. కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి పీఏ రాజణ్ణను గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఉదయం విడుదల చేశారు. ముఖ్యమంత్రి యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర పేరుతో రాజణ్ణ పలు అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి.

 ఈ నేపథ్యంలో బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేసి ఆపై విడుదల చేశారు. తన పీఏ అరెస్ట్‌పై స్పందించిన మంత్రి శ్రీరాములు అతడి వ్యవహారాల గురించి తనకేమీ తెలియదని అన్నారు. అతడు అక్రమాలకు పాల్పడి ఉంటే రక్షించే ప్రయత్నం చేయబోనని స్పష్టం చేశారు. రాజణ్ణ అక్రమాలపై తనకు అవగాహన లేదన్నారు.

మంత్రి పీఏ రాజణ్ణ అరెస్ట్‌పై స్పందించిన విజయేంద్ర ఓ ట్వీట్ చేస్తూ.. ఇలాంటి వారి వల్ల తమకు చెడ్డపేరు వస్తోందన్నారు. ఇలాంటి వ్యవహారాలు ప్రతిపక్షాల ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తాయన్నారు. ప్రజా జీవితంలో ఉన్న తమ వద్దకు వచ్చే వారందరినీ అనుమానించలేమని, అలాగని చెప్పి అశ్రద్ధగా ఉండకూదని విజయేంద్ర పేర్కొన్నారు.


More Telugu News