నూతన జోనల్ వ్యవస్థ ఏర్పాటుపై సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి కేటీఆర్

  • తెలంగాణలో నూతన జోనల్ వ్యవస్థ
  • 7 జోన్లు, 2 మల్టీ జోన్లుగా విభజన
  • ప్రభుత్వ ఉద్యోగాల్లో అత్యధికం స్థానికులకే వస్తాయన్న కేటీఆర్
  • ఇలాంటి విధానం మరెక్కడా లేదని ఉద్ఘాటన
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక తమ ప్రభుత్వం నూతనంగా జోనల్ వ్యవస్థ ఏర్పాటు చేయడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన జోనల్ వ్యవస్థ ద్వారా  తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు ఉద్యోగాలు, విద్యాపరమైన అవకాశాల్లో సమాన వాటా దక్కుతుందని పేర్కొన్నారు. ఈ జోనల్ వ్యవస్థ ఏర్పాటు కోసం సుదీర్ఘ కసరత్తు చేసి, గొప్ప దార్శనికతతో వ్యవహరించారంటూ సీఎం కేసీఆర్ కు కేటీఆర్ కృతజ్ఞతలు తెలియజేశారు. జోనల్ వ్యవస్థను పునర్ వ్యవస్థీకరించి అమల్లోకి తీసుకువచ్చారంటూ కితాబునిచ్చారు.

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో ఉన్న పాత జోనల్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసిన ప్రభుత్వం, తెలంగాణలోని అన్ని ప్రాంతాల ఆకాంక్షల మేరకు నూతన జోనల్ వ్యవస్థకు రూపకల్పన చేసిందని వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్రంలో 7 జోన్లు, 2 మల్టీ జోన్లు ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఈ జోన్ల ఏర్పాటు వల్ల దేశంలో మరెక్కడా లేని రీతిలో, ప్రభుత్వ ఉద్యోగాల్లో అత్యధికం స్థానికులకే దక్కుతాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.


More Telugu News