సువేందు అధికారిని కలిసిన సొలిసిటర్ జనరల్ ను తప్పించాలంటూ మమత పార్టీ డిమాండ్

  • శారదా కుంభకోణం, నారద కేసులో సువేందు ఉన్నారు
  • పలు కేసుల్లో ఆయనపై కేసులు ఉన్నాయి
  • సొలిసిటర్ జనరల్ చేసిన పని కేసుల విచారణపై ప్రభావం చూపుతుంది
పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారిని భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కలవడంపై మమతా బెనర్జీకి చెందిన టీఎంసీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి టీఎంసీ లేఖ రాసింది. తుషార్ మెహతాను తొలగించాలని లేఖలో డిమాండ్ చేసింది.

నారద కేసు, శారదా చిట్ ఫండ్ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న సువేందును తుషార్ మెహతా ఎలా కలుస్తారని ప్రశ్నించింది. ఎన్నో కేసుల్లో సువేందు నిందితుడిగా ఉన్నారని ఆరోపించింది. చీటింగ్, లంచం తీసుకోవడం లాంటి వాటికి సంబంధించి కెమెరా ఫుటేజీలు కూడా ఉన్నాయని చెప్పింది. ఈ మేరకు ప్రధానికి టీఎంసీ ఎంపీలు డెరెక్ ఓ బ్రియన్, మహువా మోయిత్రా, సుఖేందు శేఖర్ రాయ్ లు లేఖ రాశారు.

సొలిసిటర్ జరనల్ తో సువేందు అధికారి భేటీ కావడం ఈ కేసుల విచారణపై తీవ్ర ప్రభావం చూపుతుందని లేఖలో వారు పేర్కొన్నారు. ఈ కేసులను విచారిస్తున్న సీబీఐ, ఈడీలకు తుషార్ లీగల్ అడ్వైజర్ అని అన్నారు. ఈ సంస్థలకు ఆయన సలహాలను ఇస్తుంటారని చెప్పారు. తుషార్ చేసిన పని సొలిటర్ జనరల్ పదవికే మచ్చ తీసుకొచ్చేలా ఉందని అన్నారు. వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం పోకుండా ఉండాలంటే వెంటనే తుషార్ ను తొలగించాలని డిమాండ్ చేశారు.


More Telugu News