కరోనా వ్యాప్తి నేపథ్యంలో జైలు నుంచి ముందే విడుదలైన మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా

  • ఉద్యోగ నియామక స్కాం కేసులో చౌతాలా దోషి 
  • పదేళ్ల జైలుశిక్ష విధించిన కోర్టు
  • తొమ్మిదన్నరేళ్ల జైలుశిక్ష పూర్తిచేసుకున్న చౌతాలా
  • ఆర్నెల్లు మినహాయింపునిచ్చిన ఢిల్లీ సర్కారు
దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో జైళ్లలో రద్దీని తగ్గించేందుకు ఆయా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం కూడా ఖైదీల పట్ల ఉదారంగా వ్యవహరిస్తోంది. కొన్ని నెలల జైలు శిక్షను తగ్గించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా కూడా తీహార్ కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యారు.

ఆయన టీచర్ల రిక్రూట్ మెంట్ స్కాంలో దోషిగా తేలడంతో కోర్టు పదేళ్ల జైలుశిక్ష విధించింది. ఇప్పటివరకు తొమ్మిదిన్నరేళ్ల కారాగార వాసం పూర్తయింది. మరో ఆర్నెల్ల శిక్ష మాత్రమే మిగిలుండగా, ఢిల్లీ ప్రభుత్వం కరోనా వ్యాప్తి నేపథ్యంలో అందుకు మినహాయింపునిచ్చింది. దాంతో చౌతాలా ముందుగానే విడుదలయ్యారు. ఇవాళ అన్ని లాంఛనాలు పూర్తయిన పిదప ఆయన తీహార్ సెంట్రల్ జైలు నుంచి వెలుపలికి వచ్చారు.

ఉపాధ్యాయ నియామకాల కుంభకోణంలో 3 వేలకు పైగా జూనియర్ టీచర్లను అక్రమంగా నియమించారన్న కేసులో సీబీఐ కోర్టు ఓం ప్రకాశ్ చౌతాలాతో పాటు ఆయన కుమారుడు అజయ్ చౌతాలా, ఐఏఎస్ అధికారి సంజీవ్ కుమార్ తో పాటు మొత్తం 53 మందిని దోషులుగా నిర్ధారించి జైలు శిక్షలు వేసింది. ఇవాళ ఆయన జైలు నుంచి విడుదలైన అంశాన్ని ఢిల్లీ జైళ్ల శాఖ డీజీ సందీప్ గోయెల్ వెల్లడించారు.


More Telugu News