రాహుల్ గాంధీవి చిల్లర రాజకీయాలు: పియూష్ గోయల్

  • జులై వచ్చినా.. వ్యాక్సిన్లు మాత్రం రాలేదన్న రాహుల్
  • ఈ నెలలో 12 కోట్ల వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయన్న పియూష్
  • 15 రోజుల క్రితమే అన్ని రాష్ట్రాలకు సమాచారం ఇచ్చామని వ్యాఖ్య
జులై వచ్చింది కానీ... ఇంతవరకు కరోనా వ్యాక్సిన్లు మాత్రం రాలేదంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. దేశంలో వ్యాక్సిన్లు ఎక్కడున్నాయంటూ ఆయన ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ రాహుల్ పై విమర్శలు గుప్పించారు.

ప్రభుత్వం అందించే వ్యాక్సిన్లతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో వేసే టీకాలతో కలిపి జులై నెలలో మొత్తం 12 కోట్ల వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయని ఆయన చెప్పారు. వ్యాక్సిన్ల పంపిణీ గురించి 15 రోజుల క్రితమే అన్ని రాష్ట్రాలకు సమాచారం అందించామని తెలిపారు. రాహుల్ గాంధీ సీరియస్ రాజకీయాలు చేయకుండా, చిల్లర రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

కరోనాపై యావత్ దేశం పోరాడుతున్న తరుణంలో రాహుల్ వ్యవహరిస్తున్న తీరు సరికాదని అన్నారు. ఈ మేరకు ఆయన హిందీలో ట్వీట్ చేశారు. మరోవైపు రాహుల్ పై కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ కూడా ఈ ఉదయం విరుచుకుపడిన సంగతి తెలిసిందే. తాము ఇచ్చిన వివరాలను రాహుల్ చదవలేదా? అని ఆయన ప్రశ్నించారు.


More Telugu News