పాక్​ లో భారత హైకమిషన్​ వద్ద డ్రోన్​ కలకలం

  • ఇస్లామాబాద్ లో ఘటన
  • ఆ దేశ ప్రభుత్వానికి తీవ్ర నిరసన తెలిపిన అధికారులు
  • డ్రోన్ దాడుల నేపథ్యంలో కలవరం
జమ్మూలో వైమానిక స్థావరాలపై డ్రోన్ దాడులు జరిగిన కొన్ని రోజులకే పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లో ఉన్న భారత హైకమిషన్ వద్ద డ్రోన్ కలకలం రేగింది. ఓ డ్రోన్ హై కమిషన్ ఆఫీసుపైన చక్కర్లు కొట్టిందని అధికార వర్గాలు తెలిపాయి. ఘటనకు సంబంధించి పాక్ ప్రభుత్వానికి హైకమిషన్ అధికారులు నిరసన తెలిపినట్టు చెబుతున్నారు. భద్రత ఇంత గాలిబుడగలా ఉండడాన్ని నిలదీసినట్టు సమాచారం.

ఆదివారం అర్ధరాత్రి రెండు డ్రోన్లు జమ్మూలోని ఐఏఎఫ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పై ఐఈడీ పేలుడు పదార్థాలను వదిలిన సంగతి తెలిసిందే. ఘటనలో ఒక సిబ్బంది గాయపడ్డారు. మిగతా పరికరాలకు ఏ నష్టం జరగకపోయినా.. ఓ భవనం పైకప్పు దెబ్బతింది. ఆ తర్వాత కూడా జమ్మూలో డ్రోన్ల సంచారం ఎక్కువైంది. వరుసగా ఆకాశంలో డ్రోన్లు కనిపిస్తున్నాయి. ఇవ్వాళ కూడా అంతర్జాతీయ సరిహద్దు వద్ద డ్రోన్ కనిపించింది.

దీని వెనక ఉగ్రవాదులున్నారని ఇప్పటికే అధికారులు తేల్చారు. ఆ డ్రోన్లను వారికి సమకూరుస్తున్నది పాక్ ప్రభుత్వమేనన్న ఆరోపణలున్నాయి. ఇంత టెక్నాలజీ రోడ్డు పక్కన తయారయ్యేది కాదని, పాక్ ప్రభుత్వ సహకారం లేనిదే వారికి డ్రోన్లు దొరకవని ఆర్మీ ఉన్నతాధికారి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో తాజాగా భారత హైకమిషన్ వద్దే డ్రోన్ కనిపించడం మరింత ఆందోళన కలిగించింది.


More Telugu News