తెలంగాణ నాయకులకు వార్నింగ్ ఇచ్చిన రోజా

  • రెండు రాష్ట్రాల మధ్య ముదురుతున్న జల జగడం
  • వైయస్సార్ ను కూడా దొంగ అంటున్న తెలంగాణ నేతలు
  • వైయస్ ను విమర్శిస్తే మర్యాద ఉండదన్న రోజా
రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య మొదలైన జల జగడం ముదురుతోంది. ఇరు రాష్ట్రాలకు చెందిన అధికార పక్ష నేతలు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. తెలంగాణ మంత్రులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డిపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. వైయస్ దొంగ అయితే, జగన్ గజదొంగ అని మండిపడుతున్నారు. తెలంగాణకు వైయస్ ఎంతో అన్యాయం చేశాడని దుయ్యబడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నేతలకు వైసీపీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా వార్నింగ్ ఇచ్చారు.

వైయస్సార్ ను విమర్శిస్తే తెలంగాణ నేతలకు మర్యాద ఉండదని రోజా అన్నారు. నదీ జలాలను తెలంగాణ అక్రమంగా వాడుకోవడం తమ ప్రాంత ప్రజలకు అన్యాయం చేయడమేనని అన్నారు. ఏపీకి అన్యాయం జరిగితే చూస్తు ఊరుకోబోమని హెచ్చరించారు. తమ నీటి వాటాను తమకు కేటాయించాలని ప్రధాని మోదీ, కేంద్ర జల మంత్రి షెకావత్ లకు ఇప్పటికే సీఎం జగన్ లేఖ రాశారని చెప్పారు. శ్రీశైలం వద్ద ఏపీ వాటా నీటిని వాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తును ఉత్పత్తి చేయడం కృష్ణా నీటి బోర్డు నిర్ణయానికి వ్యతిరేకమని అన్నారు.

మహిళల భద్రత కోసం జగన్ దిశ యాప్, దిశ చట్టం, దిశ పోలీస్ స్టేషన్లను తీసుకొచ్చారని రోజా తెలిపారు. ఏనాడూ మహిళల భద్రతను పట్టించుకోని చంద్రబాబును టీడీపీ మహిళా నేతలు ప్రశ్నించలేదని... కానీ, ఎంతో చేస్తున్న జగన్ ను విమర్శించడం విడ్డూరమని ఎద్దేవా చేశారు.


More Telugu News