అసలు రాహుల్ గాంధీ సమస్య ఏమిటి?: హర్షవర్ధన్

  • జులై వచ్చింది.. వ్యాక్సిన్లు మాత్రం రాలేదన్న రాహుల్
  • అహంకారానికి వ్యాక్సిన్ లేదన్న హర్షవర్ధన్
  • కాంగ్రెస్ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపాటు
దేశ ప్రజలకు సరిపడా కరోనా వ్యాక్సిన్ డోసులను కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేయలేకపోతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడుతున్న సంగతి తెలిసిందే. జులై నెల వచ్చింది కానీ... వ్యాక్సిన్లు మాత్రం రాలేదని రాహుల్ తాజా ట్వీట్ లో కేంద్రాన్ని విమర్శించారు. రాహుల్ వ్యాఖ్యలను కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తప్పుపట్టారు. రాహుల్ అహంకార ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వ్యాక్సిన్ల సరఫరాపై చర్చకు రావాలని తాము అంటుంటే... చర్చకు రాకుండా ఆయన తప్పించుకుంటున్నారని విమర్శించారు.

జులై నెలలో వ్యాక్సిన్ల లభ్యతకు సంబంధించి నిన్ననే తాను వివరాలను వెల్లడించానని హర్షవర్ధన్ చెప్పారు. అసలు రాహుల్ సమస్య ఏమిటని ప్రశ్నించారు. తాము ప్రకటించిన వివరాలను రాహుల్ చదవలేదా? లేక ఆ వివరాలు ఆయనకు అర్థం కాలేదా? అని అడిగారు. దేనికైనా వ్యాక్సిన్ ఉంటుందని... అహంకారానికి వ్యాక్సిన్ లేదని దుయ్యబట్టారు. వారి పార్టీ నాయకత్వంపై కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలని అన్నారు.

రాహుల్ తో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు కూడా బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని హర్షవర్ధన్ మండిపడ్డారు. ఏది నిజం అనే దాన్ని ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. 75 శాతం వ్యాక్సిన్లను కేంద్రం ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందని తెలిపారు. జూన్ నెలలో 11.50 కోట్ల డోసుల వ్యాక్సిన్ ను పంపిణీ చేశామని చెప్పారు. జులై నెలలో 12 కోట్ల డోసులను సరఫరా చేయబోతున్నామని తెలిపారు. వీటితో పాటు ప్రైవేటు ఆసుపత్రులు వేసే వ్యాక్సిన్లు వీటికి అదనమని చెప్పారు.


More Telugu News