దిగొస్తున్న కరోనా కేసులు.. 43 శాతం తగ్గిన మరణాలు!

  • అదుపులోకి వస్తున్న కరోనా మహమ్మారి
  • మేతో పోలిస్తే 75 శాతం తగ్గిన కేసులు
  • మే నెలలో 88.82 లక్షల కేసులు, 1.17 లక్షల మరణాలు
  • జూన్‌లో 21.87 లక్షల కేసులు, 66,550 మరణాలు
కరోనా రెండో దశ విజృంభణ నుంచి దేశం క్రమంగా కోలుకుంటోంది. రోజురోజుకీ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో మరణాల సంఖ్య సైతం దిగివస్తోంది. గత నెలతో పోలిస్తే ఈ నెలలో మరణాలు 43 శాతం.. కొవిడ్‌ కేసులు 75 శాతం తగ్గినట్లు ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి.

మే నెలలో 88.82 లక్షల మంది మహమ్మారి బారిన పడ్డారు. 1.17 లక్షల మంది మరణించారు. అదే జూన్‌లో 21.87 లక్షల మందికి వైరస్‌ సోకింది. 66,550 మందిని మహమ్మారి బలి తీసుకుంది.  

మే నెలలో కరోనా రెండో దశ దేశాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. కొన్ని రోజులు వరుసగా 4 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. అలాగే ఓ దశలో ఒక్కోరోజు నాలుగు వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం పరిస్థితి క్రమంగా అదుపులోకి వస్తున్నట్లు కనిపిస్తోంది. రోజువారీ మరణాల సంఖ్య వేల నుంచి వందలకు దిగి వచ్చింది. కేసుల సంఖ్య లక్షల నుంచి వేలకు పరిమితమవుతోంది. ఇక మంగళవారం ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో  దేశంలో 45,951 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 817 మంది మృతిచెందారు.


More Telugu News