మంత్రిగా ఉన్నప్పుడే ఏమీ చేయలేదు.. ఇప్పుడేం చేస్తారు?:ఈటలపై గంగుల విమర్శలు

  • సొంత పనుల కోసమే సీఎంను కలిసేవారు
  • తన నియోజకవర్గాన్ని ఈటల అభివృద్ధి చేయలేదు
  • హుజూరాబాద్ లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుంది
మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ పై మంత్రి గంగుల కమలాకర్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నో ఏళ్లు మంత్రిగా వెలగబెట్టినప్పటికీ హుజూరాబాద్ నియోజకవర్గానికి ఈటల చేసిందేమీ లేదని... ఇప్పుడు ఆయన చేసేదేముందని ఎద్దేవా చేశారు. తన సొంత పనుల కోసమే సీఎం కేసీఆర్ వద్దకు ఈటల వెళ్లేవారని... నియోజకవర్గ పనుల కోసం ఏనాడూ వెళ్లలేదని విమర్శించారు. రెండు సార్లు ఈటల మంత్రి పదవిని చేపట్టినా హుజూరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి ఎందుకు జరగలేదని ప్రశ్నించారు.
 
తామంతా తమ నియోజకవర్గ పరిస్థితిని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగానే ఆయన వెంటనే రూ. 31 కోట్లను మంజూరు చేశారని గంగుల చెప్పారు. 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ జరగని అభివృద్ధిని కేవలం ఏడేళ్లలో కేసీఆర్ చేశారని చెప్పారు. దేశంలో విద్యుత్తును ఉచితంగా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. ఈటలను నియోజకవర్గ ప్రజలు నమ్మబోరని అన్నారు.


More Telugu News