మేం ఏ తప్పూ చేయలేదు: బ్రెజిల్​ తో డీల్​ పై భారత్​ బయోటెక్​ వివరణ

  • అన్ని నియమాలనూ పాటించాం
  • మాకు ఒక్క పైసా ముట్టలేదు
  • మేం ఒక్క డోసూ సరఫరా చేయలేదు
  • ముందు నిర్ణయించిన ధరకే ఒప్పందం
  • ప్రకటన విడుదల చేసిన సంస్థ
బ్రెజిల్ తో 32.4 కోట్ల డాలర్ల విలువైన కొవాగ్జిన్ డీల్ లో అవకతవకలు జరిగాయన్న కథనాల నేపథ్యంలో భారత్ బయోటెక్ స్పందించింది. డీల్ విషయంలో తాము ఏ తప్పూ చేయలేదని వివరణ ఇస్తూ ఇవ్వాళ ప్రకటనను విడుదల చేసింది. బ్రెజిల్ తో డీల్ కు సంబంధించి ఒప్పందం నుంచి రెగ్యులేటరీ అనుమతుల దాకా అన్ని నియమాలనూ పాటించామని చెప్పింది.

‘‘2020 నవంబర్ లో డీల్ పై బ్రెజిల్ తో చర్చలు జరిపినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ 8 నెలల కాలంలో ప్రతి నియమాన్నీ మేం పాటించాం. జూన్ 4న కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి ఆ దేశ ప్రభుత్వం అనుమతులను ఇచ్చింది. అయితే, ఇప్పటిదాకా ఆ దేశ ప్రభుత్వం నుంచి మాకు ఒక్క పైసా ముట్టలేదు.. మేం ఒక్క డోసూ సరఫరా చేయలేదు. వివిధ దేశాలతో చేసుకున్న, చేసుకుంటున్న ఒప్పందాల్లోనూ అన్ని నియమాలను అనుసరించాం’’ అని పేర్కొంది.

కొన్ని వారాలుగా మీడియా సంస్థల్లో కొవాగ్జిన్ కొనుగోళ్ల ఒప్పందాలపై ‘తప్పుడు కథనాలు’ వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. భారత్ మినహా విదేశాలకు సరఫరా చేసే వ్యాక్సిన్లపై ఒక్క డోసుకు 15 నుంచి 20 డాలర్లుగా ధరను ముందే నిర్ణయించామని గుర్తు చేసింది. బ్రెజిల్ కూ 15 డాలర్లకే వ్యాక్సిన్ ను సరఫరా చేసేలా ఒప్పందం చేసుకున్నామని వివరించింది.

తాము నిర్ణయించిన ధరతోనే చాలా దేశాలతో ఒప్పందాలు అయ్యాయని, దానికి సంబంధించిన అడ్వాన్స్ చెల్లింపులూ జరిగాయని చెప్పింది. బ్రెజిల్ విషయంలో ప్రెసిసా మెడికమెంటోస్ సంస్థతో జత కలిశామని, ఇప్పటికే రెగ్యులేటరీ అనుమతులకు దరఖాస్తు చేశామని, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కూ దరఖాస్తు చేసుకున్నామని పేర్కొంది.

కాగా, కొవాగ్జిన్ ఒప్పందంలో అడ్వాన్స్ చెల్లింపులకు సంబంధించి బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో అవకతవకలకు పాల్పడ్డారని కోర్టు తేల్చిన సంగతి తెలిసిందే. థర్డ్ పార్టీ కంపెనీ అయిన మాడిసన్ బయోటెక్ పేరిట బోల్సోనారో ఇన్ వాయిస్ లు సృష్టించారని ఫెడరల్ దర్యాప్తు సంస్థలు తేల్చాయి. ఒప్పందాన్ని రద్దు చేశాయి.


More Telugu News