ప్రైవేటు ఆసుపత్రులకు ఇచ్చే టీకా డోస్ లపై పరిమితులు!

  • ఇకపై నేరుగా కొనుక్కునే వీలుండదు
  • కొవిన్ యాప్ ద్వారా మాత్రమే ఆర్డర్లు
  • రోజువారీ టీకాల సగటుకు రెట్టింపు మాత్రమే ఆర్డర్ చేసుకునే వీలు
  • రేపటి నుంచి అమలులోకి కొత్త నిబంధనలు  
దేశంలోని ప్రైవేటు ఆసుపత్రులకు అందిస్తున్న టీకా డోస్ లపై పరిమితులు విధించాలని కేంద్రం నిర్ణయించింది. రేపటి నుంచి ప్రైవేటు ఆసుపత్రులు నేరుగా వ్యాక్సిన్ తయారు సంస్థల నుంచి టీకాలను కొనుగోలు చేయడానికి వీల్లేదని, కొవిన్ యాప్ ద్వారా మాత్రమే ఆర్డర్లు పెట్టాలని ఆదేశించింది. ప్రైవేటు ఆసుపత్రులకు నెలవారీ గరిష్ఠ పరిమితి విధించనున్నామని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ మేరకు ముసాయిదా ప్రతిపాదనలు సిద్ధంకాగా, వాటిని నిన్న ఆసుపత్రులకు పంపించారు.

ప్రైవేటు ఆసుపత్రుల్లో రోజువారీ ఇస్తున్న టీకాల సగటుకు కేవలం రెట్టింపు మాత్రమే స్టోర్ చేసుకునేందుకు అనుమతిస్తామని, ఈ సంఖ్య, అంతకుముందు నెలలో ఏదైనా ఒక వారంలో (ఆసుపత్రి ఎంచుకునే వారం) సరాసరి టీకా పంపిణీని బట్టి నిర్ణయిస్తామని, మరిన్ని వివరాలు కొవిన్ వెబ్ సైట్ నుంచి తీసుకోవచ్చని పేర్కొన్నారు.

ఉదాహరణకు ఓ ఆసుపత్రిలో జూన్ 1 నుంచి 7 మధ్య 700 డోస్ లను ఇచ్చుంటే, రోజువారీ సరాసరి 100 అవుతుంది. ఆ లెక్కన జులైలో సదరు ఆసుపత్రి రోజుకు 100 టీకాల చొప్పున 30 రోజులకు ఎన్ని టీకాలు అవసరం అవుతాయో అంతకు రెట్టింపు మాత్రమే ఆర్డర్ చేయాల్సి వుంటుంది. అంటే, ఆ ఆసుపత్రిపై 6000 టీకాల పరిమితి ఉంటుంది. అయితే, నెలలోని రెండో అర్థభాగంలో దీన్ని మరోసారి సమీక్షిస్తారు. తొలి 15 రోజుల్లో ఇచ్చిన వ్యాక్సిన్ డోస్ ల సరాసరిని వర్తింపజేస్తారు.

ఇక ఇప్పటివరకూ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో చేరకుండా, ఇప్పుడు చేరాలని భావించే ఆసుపత్రుల్లో బెడ్ల సంఖ్యను బట్టి గరిష్ఠ పరిమితిని నిర్ణయిస్తారు. ఉదాహరణకు 50 పడకలు ఉంటే, 3 వేల డోస్ లను పొందే వీలుంటుంది, 50 నుంచి 300 పడకలు ఉంటే 6 వేల డోస్ లు, అంతకు మించిన సంఖ్యలో బెడ్స్ ఉంటే, 10 వేల డోస్ లకు ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ ఆర్డర్లు కూడా ఒకేసారి చేసేందుకు వీలుండదు. నెలలో నాలుగు విడతలుగా ఆర్డర్ చేసుకోవాలి. ఇందుకు చెల్లించాల్సిన డబ్బును నేషనల్ హెల్త్ అథారిటీ పోర్టల్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.


More Telugu News