ఇండియాలో ఉద్యోగానికి అత్యంత ఆకర్షణీయమైన కంపెనీలివిగో!

  • తొలి స్థానంలో నిలిచిన గూగుల్
  • ఆ తరువాత అమెజాన్, మైక్రోసాఫ్ట్
  • టాప్-10లో ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐబీఎం, విప్రో
  • రాండ్ స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ వివరాలు
ఇండియాలో ఉద్యోగానికి అత్యంత ఆకర్షణీయమైన కంపెనీగా గూగుల్ నిలువగా, ఆ తరువాతి స్థానాల్లో అమెజాన్, మైక్రోసాఫ్ట్ నిలిచాయి. రాండ్ స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ (ఆర్ఈబీఆర్) 2021 సర్వే వివరాలు వెల్లడికాగా, బలమైన ఆర్థిక బలం, ఆకర్షణీయమైన వేతనాలు, ఇతర ప్రోత్సాహకాలు గూగుల్ ను ముందు నిలిపాయి. ఈ మూడు కంపెనీల తరువాత టాప్ -10లో ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, టాటా స్టీల్, డెల్ టెక్నాలజీస్, ఐబీఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విప్రో, సోనీలు నిలిచాయని ఆర్ఈబీఆర్ పేర్కొంది.

మొత్తం 34 దేశాల్లో 6,493 కంపెనీలకు చెందిన 1.90 లక్షల మందిని తమ రీసెర్చ్ లో భాగం చేశామని, వారంతా 18 నుంచి 65 ఏళ్ల వయసులో ఉన్న సాధారణ ప్రజలేనని ఆర్ఈబీఆర్ వెల్లడించింది. తాము ఉద్యోగం చేయాలని భావిస్తే, ఆ కంపెనీ యజమాన్యం ముఖ్యమని, ఆ తరువాత వేతనం గురించి ఆలోచిస్తామని అత్యధికులు పేర్కొన్నారు.

తమ ఉద్యోగం, జీవితాన్ని సమన్వయం చేసుకోగలిగేలా ఉండే ఉద్యోగం కావాలని 65 శాతం మంది కోరుతుంటే, మంచి వేతనం, ప్రోత్సాహకాలు కావాలని 62 శాతం మంది భారతీయులు కోరుకుంటున్నారని సర్వే తెలిపింది. ఆ తరువాత కరోనా నేపథ్యంలో ఉద్యోగ భద్రతను ఇచ్చేలా ఉండే కంపెనీని 61 శాతం మంది కోరుకుంటున్నారు.

కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగుతున్న వేళ, ఉద్యోగార్ధుల ప్రాధాన్యతలు మారాయని, అందువల్లే ఎంప్లాయర్ బ్రాండింగ్ అనే ఆలోచన చేసి, సర్వే చేశామని రాండ్ స్టాడ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పీఎస్ విశ్వనాథ్ వెల్లడించారు. ప్రస్తుతం ఉద్యోగార్థులు కంపెనీలో విలువలను పరిశీలిస్తున్నారని, తమ అవసరాలు తీర్చే యాజమాన్యాలను కోరుతున్నారని తెలిపారు.

ఇక 2020 రెండో అర్ధభాగంలో 21 శాతం మంది ఉద్యోగులు కంపెనీలను మార్చుకున్నారని, వీరిలో అత్యధికులు 25 నుంచి 34 ఏళ్ల  మధ్య వారేనని సర్వే తేల్చింది. గడచిన ఆరు నెలల్లో కరోనా ప్రభావాన్ని ఎదుర్కొన్న కారణంగానే ఉద్యోగాలను మార్చుకున్నామని అత్యధికులు వ్యాఖ్యానించారు.


More Telugu News