బెంగాల్‌లో ఎన్‌హెచ్‌ఆర్‌సీ బృందంపై దాడి.. రౌడీయిజంగా అభివర్ణించిన బీజేపీ

  • ఫలితాల అనంతరం బెంగాల్‌లో హింస
  • దర్యాప్తు జరపాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీకి హైకోర్టు ఆదేశం
  • నేడు జాదవ్‌పూర్‌లో పర్యటించిన బృందం
  • దాడి చేసిన దుండగులు
  • ఏ ఒక్కరిపైనా దాడి జరగదన్న తృణమూల్‌ 
బెంగాల్‌లో ఈరోజు అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత చెలరేగిన హింసపై దర్యాప్తు జరిపేందుకు వెళ్లిన ‘జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్‌ఆర్‌సీ)’ సభ్యులపై దుండగులు దాడి చేశారు. జాదవ్‌పూర్‌లో కొంతమంది అల్లరిమూకలు తమపై దాడి చేశారని ఓ ఎన్‌హెచ్‌ఆర్‌సీ అధికారి తెలిపినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ పేర్కొంది.  

ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన హింసపై దర్యాప్తు జరపాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీని కోల్‌కతా హైకోర్టు జూన్‌ 18న ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే వారు బాధితులతో మాట్లాడేందుకు నేడు జాదవ్‌పూర్‌ వెళ్లారు. దర్యాప్తులో 40 ఇళ్లు దగ్ధమైనట్లు తాము గుర్తించామని అధికారి తెలిపినట్లు ఏఎన్‌ఐ తెలిపింది.

మరోవైపు ఈ ఘటనపై ఇటు అధికార తృణమూల్‌, ప్రతిపక్ష బీజేపీ భిన్నంగా స్పందించాయి. తృణమూల్‌ ఎమ్మెల్యే మదన్‌ మిత్రా మాట్లాడుతూ.. ‘‘జాతీయ సంస్థల తరఫున వచ్చిన ఏ ఒక్కరిపై దాడి జరగదు. ప్రజలు ఎన్‌హెచ్‌ఆర్‌సీ బృందంపై ఎందుకు దాడి చేస్తారు? ఇప్పటికే బెంగాల్‌ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షాలపై పెద్ద దాడి చేశారు’’ అన్నారు.

మరోవైపు బీజేపీ ఈ చర్యను రౌడీయిజంగా అభివర్ణించింది. ఇది సిగ్గుమాలిన చర్య అని.. దీంతో బెంగాల్‌లో ఏం జరుగుతోందో తెలిసిపోతోందని ప్రతిపక్ష నేత సువేందు అధికారి అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ పర్యటనకు రాలేదని.. కోర్టు ఆదేశాల మేరకే వచ్చిందని తెలిపారు.


More Telugu News