లుకౌట్ నోటీసులపై హైకోర్టులో పిటిషన్ వేసిన సుజనా చౌదరి

  • గతంలో సుజనాపై లుకౌట్ నోటీసులు
  • బ్యాంకు ఫ్రాడ్ కేసులో చర్యలు
  • మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన వైనం
  • తాను అమెరికా వెళ్లేందుకు అనుమతించాలని విన్నపం
బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు గతంలో లుకౌట్ నోటీసులు జారీ చేయడం తెలిసిందే. బ్యాంకు రుణాలు చెల్లించలేదన్న ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు జరుగుతుండగా, ఆయన అమెరికా వెళ్లే ప్రయత్నాన్ని ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో సుజనా చౌదరి అప్పట్లో హైకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకున్నారు. తాజాగా ఆయన మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

తాను అమెరికాలో ఓ సదస్సుకు వెళ్లాల్సి ఉందని, లుకౌట్ నోటీసులు పెండింగ్ లో వున్నందున తనకు అనుమతి మంజూరు చేయాలని కోర్టులో పిటిషన్ వేశారు. అమెరికా నుంచి సదస్సుకు రావాలంటూ తనను ఆహ్వానించారని ఆయన కోర్టుకు తెలిపారు. జులై రెండో వారంలో సదస్సు జరగనుందని, ఈ దృష్ట్యా తన పిటిషన్ పై సత్వర విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా కోర్టు స్పందిస్తూ... ఆహ్వానపత్రం ఏదని సుజనా తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ఆహ్వానపత్రం ఉంటేనే తాము నిర్ణయం తీసుకోగలమని స్పష్టం చేసిన ధర్మాసనం తదుపరి విచారణను జులై 7కి వాయిదా వేసింది.


More Telugu News