ప్రైవేటు ఆసుపత్రులు వినియోగించని వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలకు కేటాయించాలి: ప్రధానికి లేఖ రాసిన సీఎం జగన్

  • ప్రైవేటు ఆసుపత్రులకు 25 శాతం టీకాల కేటాయింపు
  • ప్రైవేటు ఆసుపత్రుల్లో డిమాండ్ తక్కువగా ఉందన్న జగన్
  • వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని సూచన
  • త్వరగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి
తగినన్ని కరోనా వ్యాక్సిన్ డోసులను కేటాయిస్తే, సామర్థ్యం మేర వాటిని ప్రజలకు అందిస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు కేటాయిస్తున్న వ్యాక్సిన్ డోసులు వృథాగా మిగిలిపోతున్నాయని, వాటిని రాష్ట్రాలకు కేటాయించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి లేఖ రాశారు.

ప్రైవేటు ఆసుపత్రులకు 25 శాతం వ్యాక్సిన్లు కేటాయించారని, కానీ వాటిలో చాలా టీకాలు వినియోగించకుండా మిగిలిపోతున్నాయని పేర్కొన్నారు. జులై మాసానికి గాను ప్రైవేటు ఆసుపత్రులకు 17,71,580 కరోనా వ్యాక్సిన్లు కేటాయించారని వెల్లడించారు. కానీ ఏపీలో ఇప్పటివరకు ప్రైవేటు ఆసుపత్రుల ద్వారా వ్యాక్సిన్లు పొందింది 2,67,075 మాత్రమేనని సీఎం జగన్ వివరించారు. దీన్నిబట్టి ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా వ్యాక్సిన్ కు ఏమంత డిమాండ్ లేదన్న విషయం స్పష్టమవుతోందని, ఈ నేపథ్యంలో, ప్రైవేటు ఆసుపత్రులు వినియోగించని కరోనా వ్యాక్సిన్లను రాష్ట్రాల వ్యాక్సినేషన్ డ్రైవ్ లకు కేటాయించాలని సిఫారసు చేశారు.

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగవంతం అయ్యేందుకు ఈ చర్య ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సీఎం పేర్కొన్నారు. కేంద్రం గనుక ఈ నిర్ణయం తీసుకుంటే ఇది కచ్చితంగా ఎంతో ప్రజాదరణ పొందుతుందని జగన్ అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రధాని మోదీకి ఆయన విజ్ఞప్తి చేశారు.


More Telugu News