జమ్ము విమానాశ్రయంపై దాడిలో పిజ్జా డెలివరీ డ్రోన్ల వినియోగం?

  • జమ్ములో వాయుసేన స్థావరంపై డ్రోన్లతో దాడి
  • పాక్‌ ఏజెన్సీల హస్తం ఉందని అనుమానం
  • ముమ్మరంగా కొనసాగుతున్న దర్యాప్తు
  • చైనా డ్రోన్లను కొనుగోలు చేసిన పాక్‌
  • పిజ్జా, ఔషధాల డెలివరీ కోసమని నాటకం!
జమ్ము విమానాశ్రయంలోని వాయుసేన సైనిక స్థావరంపై జరిగిన డ్రోన్ దాడిపై విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. దర్యాప్తును ఎన్‌ఐఏకు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ దాడి వెనుక పాక్‌ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా హస్తం ఉండి ఉంటుందని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. పాక్‌ ఏజెన్సీల సహకారం వల్లే ఈ దాడి జరిగి ఉంటుందని అనుమానిస్తున్నాయి.

అయితే, పాక్‌కు డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చాయన్న విషయంపై నిఘా వర్గాలు కీలక సమాచారాన్ని కనిపెట్టాయి. కొవిడ్‌ కట్టడి నిబంధనల నేపథ్యంలో పిజ్జా డెలివరీ, ఔషధాల పంపిణీ నిమిత్తం పాకిస్థాన్ భారీ ఎత్తున ఇటీవల చైనా నుంచి డ్రోన్లను  కొనుగోలు చేసినట్లు సమాచారం. వీటినే తాజా దాడిలో వినియోగించి ఉంటారని అనుమానిస్తున్నారు.

భారత్‌లో జరిగిన తొలి డ్రోన్ దాడి కావడంతో కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. చీకట్లో తక్కువ ఎత్తులో వచ్చిన డ్రోన్‌ కదలికల్ని భారత నిఘా వ్యవస్థలు పసిగట్టలేకపోయాయి. మరోవైపు ఉగ్రవాదుల చేతికి డ్రోన్‌ వినియోగ సాంకేతికత చేరడం ఆందోళన కలిగిస్తోంది. భవిష్యత్తులో ఇది పెను సవాల్‌ విసిరే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో డ్రోన్‌ విధ్వంసక వ్యవస్థ ఏర్పాటుపై దృష్టి సారించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ‘డ్యూ’ పేరిట డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన ఓ సాంకేతికతను ఇంకా ఉత్పత్తి చేయాల్సి ఉంది.


More Telugu News