పారిశ్రామిక ప్రగతిలో ఏపీ ముందడుగు వేయాలి: స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో సీఎం జగన్

  • నేడు సమావేశమైన స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు
  • సీఎం జగన్ అధ్యక్షతన సమావేశం
  • హాజరైన కీలక శాఖల మంత్రులు
  • పలు పరిశ్రమల ఏర్పాటు, విస్తరణలకు ఆమోదం
ఇవాళ జరిగిన స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో అనేక పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఇవ్వాలని స్పష్టం చేశారు. అయితే, నూతనంగా వస్తున్న పరిశ్రమలతో పర్యావరణంపై పడే ప్రభావాన్ని కూడా గమనించాలని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ రాష్ట్రాన్ని పారిశ్రామిక ప్రగతిపథంలో ముందుకు నడిపించాలని దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మేకపాటి మాట్లాడుతూ, భారీ పరిశ్రమల రంగంలో రూ.14 వేల కోట్ల పెట్టుబడులపై సీఎం చర్చించారని వెల్లడించారు. నెల్లూరు జిల్లాలో జిందాల్ స్టీల్ ప్లాంట్ వస్తోందని, తద్వారా 25 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

కాగా, నేటి ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో... కడప జిల్లా కొప్పర్తి వద్ద పిట్టి రెయిల్ ఇంజినీరింగ్ కాంపొనెంట్స్ లిమిటెడ్, నీల్ కమల్ ఫర్నిచర్ పరిశ్రమ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. నెల్లూరు జిల్లా నాయుడు పేటలో గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ విస్తరణకు, చిత్తూరు జిల్లా ఎలకటూరులో అమ్మాయప్పర్ టెక్స్ టైల్స్ ప్రైవేటు లిమిటెడ్ పరిశ్రమకు, విశాఖ జిల్లా అచ్యుతాపురంలో నిర్మితమవుతున్న సెయింట్ గోబైన్ పరిశ్రమ ఏర్పాటు తుది గడువు పెంపుకు ఆమోదం లభించింది.


More Telugu News