వ్యాక్సిన్​ అనుమతులకు మోడర్నా దరఖాస్తు!

  • దిగుమతి చేసుకోనున్న సిప్లా
  • త్వరలోనే డీసీజీఐ ఆమోదం
  • వెల్లడించిన అధికార వర్గాలు
భారత్ లో మరో కరోనా వ్యాక్సిన్ కు మార్గం సుగమం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో టీకా అనుమతుల కోసం అమెరికా సంస్థ మోడర్నా దరఖాస్తు పెట్టుకుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆ సంస్థ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లను భారత్ కు దిగుమతి కోసం ముంబైకి చెందిన సిప్లా కూడా దరఖాస్తు చేసిందని అధికారులు చెబుతున్నారు. త్వరలోనే మోడర్నా ఎంఆర్ఎన్ఏ టీకాకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) పచ్చ జెండా ఊపుతుందని అంటున్నారు.

విదేశాల్లో అనుమతులు పొందిన టీకాలకు ఇక్కడ బ్రిడ్జి ట్రయల్స్ అక్కర్లేదన్న ప్రభుత్వ నిబంధనలను పేర్కొంటూ.. మోడర్నా టీకాల దిగుమతికి అనుమతివ్వాలని సిప్లా దరఖాస్తులో పేర్కొంది. భారత్ కు వ్యాక్సిన్లను కొవ్యాక్స్ ప్రోగ్రామ్ ద్వారా భారత్ కు సరఫరా చేస్తామని అమెరికా ప్రకటించినట్టు మోడర్నా తన దరఖాస్తులో తెలియజేసింది.

కాగా, త్వరలోనే ఫైజర్ వ్యాక్సిన్ భారత్ లో అందుబాటులోకి వస్తుందని ఆ సంస్థ సీఈవో ఆల్బర్ట్ బౌర్లా ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్ లో అనుమతులు తుది దశలో ఉన్నాయని ఆయన చెప్పారు. ఇప్పటికే స్పుత్నిక్ వ్యాక్సిన్లకు భారత్ అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే కొన్ని లక్షల డోసులను రష్యా పంపించింది. వాటిని డాక్టర్ రెడ్డీస్ మార్కెటింగ్ చేస్తోంది. 


More Telugu News