మహిళకు వెంటవెంటనే మూడు డోసుల వ్యాక్సిన్​!

  • థానేలో సిబ్బంది నిర్లక్ష్యం
  • నిమిషాల వ్యవధిలో ఇచ్చిన వైనం
  • భర్తకు చెప్పడంతో వెలుగులోకి
  • ఇంత నిర్లక్ష్యమా? అని బీజేపీ నిరసన
మహారాష్ట్రలోని థానేలో ఓ మహిళకు అధికారులు ఒకేసారి మూడు డోసుల కరోనా వ్యాక్సిన్ వేశారు. గత శుక్రవారం ఆనంద్ నగర్ లోని టీకా కేంద్రంలో సిబ్బంది నిర్లక్ష్యంతో 28 ఏళ్ల మహిళకు నిమిషాల వ్యవధిలో మూడు డోసుల టీకాలు వేశారు. థానే మున్సిపల్ కార్పొరేషన్ (టీఎంసీ)లో పనిచేసే తన భర్తకు ఆమె జరిగిందంతా చెప్పడంతో.. అతడు స్థానిక కార్పొరేటర్ కు విషయాన్ని వివరించాడు.

ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ అధికారులే ఆమెను పర్యవేక్షణలో ఉంచారు. అయితే, తన భర్తది ప్రభుత్వ ఉద్యోగమని, ఘటనపై కేసు పెట్టనని ఆమె చెప్పింది. తన భార్యకు వ్యాక్సినేషన్ విధానం గురించి తెలియదని ఆమె భర్త చెప్పాడు. వెంటవెంటనే మూడు డోసుల తీసుకోవడం వల్ల ఆ రోజు ఆమెకు బాగా జ్వరం వచ్చిందని, మర్నాడే తగ్గిపోయిందని వివరించాడు. ప్రస్తుతం ఆమె బాగానే ఉందన్నాడు.

విషయం తెలిసిన వెంటనే బాధితురాలిని అబ్జర్వేషన్ లో పెట్టామని, ఆమె ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉందని టీఎంసీ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఖుష్బూ తావ్డే చెప్పారు. ఘటనపై దర్యాప్తు కోసం కమిటీని వేశామన్నారు. ఘటన నేపథ్యంలో థానే మున్సిపల్ కమిషనర్ బిపిన్ శర్మ ఆఫీసును బీజేపీ నేతలు ముట్టడించారు.

టీకా కేంద్రాల్లో పనిచేసే అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే నిరంజన్ దవఖరే అన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న మహిళకే మళ్లీ వ్యాక్సిన్ వేస్తున్నట్టు సిబ్బంది ఎలా గుర్తించలేకపోయారని ఆయన మండిపడ్డారు. ఒకేసారి మూడు డోసులు ఎలా వేశారని ప్రశ్నించారు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, కారకులపై చర్యలు తీసుకుంటామని మేయర్ నరేశ్ మెహస్కే హామీ ఇచ్చారు.


More Telugu News