భారత వృద్ధి రేటును కుదించిన ఎస్ అండ్ పీ!

  • 11 శాతం నుంచి 9.5 శాతానికి తగ్గింపు
  • కరోనా, లాక్ డౌన్ కొనసాగుతుండటమే కారణమని వెల్లడి
  • స్వల్పంగా పెరగనున్న చైనా వృద్ధి రేటు
  • సౌతాఫ్రికాతో పాటు లాటిన్ అమెరికా దేశాల్లో వృద్ధి అంచనాలు పెంపు
ఆసియాలో పెద్ద దేశాలుగా ఉన్న ఇండియాతో పాటు ఫిలిప్పీన్స్, మలేషియా తదితర దేశాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు మరింతగా తగ్గనుందని ప్రముఖ రేటింగ్ సంస్థ ఎస్ అండ్ పీ గ్లోబల్ అంచనా వేసింది. ఇదే సమయంలో చైనా వృద్ధి రేటుతో పాటు సౌతాఫ్రికాతో పాటు లాటిన్ అమెరికాలోని దేశాల వృద్ధి పెరుగుతుందని పేర్కొంది.

ఇండియా విషయంలో గతంలో అంచనా వేసిన 11 శాతం వృద్ధి రేటు సాధ్యం కాకపోవచ్చని, 9.5 శాతం వరకూ జీడీపీ పెరుగుతుందని అంచనా వేసింది. కరోనా రెండో దశ కారణంగా పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ నిబంధనలు ఇంకా అమలవుతుండటమే ఇందుకు కారణమని వెల్లడించింది. ఫిలిప్పీన్స్ లో గత అంచనాలు కుదిస్తున్నామని, 7.9 శాతం నుంచి జీడీపీ 6 శాతానికి తగ్గవచ్చని, మలేషియా వృద్ధి 6.2 శాతం నుంచి 4.1 శాతానికి పడిపోతుందని తెలిపింది.
 
చైనా వృద్ధి అంచనాలను 8 నుంచి 8.3 శాతానికి సవరిస్తున్నామని, బ్రెజిల్ జీడీపీ వృద్ధి 3.4 నుంచి 4.7 శాతానికి పెరగవచ్చని ఎస్ అండ్ పీ తన తాజా అంచనాలను వెలువరించింది. మెక్సికో వృద్ధి రేటును 4.9 శాతం నుంచి 5.8 శాతానికి, సౌతాఫ్రికా వృద్ధి 3.6 శాతం నుంచి 4.2 శాతానికి, పోలాండ్ వృద్ధి 3.4 శాతం నుంచి 4.5 శాతానికి, రష్యా వృద్ధి 3.3 శాతం నుంచి 3.7 శాతానికి సవరిస్తున్నట్టు తెలియజేసింది.

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆర్థిక అననుకూలత నెలకొని ఉందని, వ్యాక్సిన్ల పంపిణీ త్వరితగతిన సాగకపోవడమే ఇందుకు కారణమని అభిప్రాయపడ్డ రేటింగ్ సంస్థ, టీకాలు తీసుకున్న వారి సంఖ్య పెరిగేకొద్దీ మహమ్మారి చూపుతున్న ప్రభావం తగ్గుతుందని తెలిపింది.


More Telugu News