మరింత వేగంగా వ్యాక్సినేషన్ ఇప్పట్లో సాధ్యం కాదు!

  • వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేస్తామంటున్న కేంద్రం
  • టీకాల లభ్యతపై అనుమానాలు
  • గత కేంద్ర లక్ష్యానికి దూరంగా గణాంకాలు
  • అన్ని టీకాలూ అందుబాటులోకి రావాల్సిన అవసరం
ఇండియాలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను జులైలో మరింత వేగవంతం చేస్తామని, నిత్యమూ సగటున 40 లక్షల టీకాలు ఇస్తున్నామని, ఈ టార్గెట్ ను పెంచుతామని గత వారంలో సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ లో కేంద్రం వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే, కేంద్ర తాజా గణాంకాలను చూస్తే, జులైలో వ్యాక్సిన్ సరఫరా మరింతగా తగ్గవచ్చని, టీకాల ప్రక్రియ వేగవంతం కాకపోవచ్చని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

జులైలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 12 కోట్ల డోస్ లను ఇస్తామని కేంద్రం శనివారం నాడు సుప్రీంకోర్టుకు చెప్పింది. ఇందులో 10 కోట్ల కొవిషీల్డ్, 2 కోట్ల కొవాగ్జిన్ టీకాలు ఉంటాయని కూడా స్పష్టం చేసింది. కేంద్రం చెప్పినట్టు జరిగితే, రోజుకు 40 లక్షల టీకాల పంపిణీ సాధ్యమే.

అయితే, గతంలో జులై నాటికి రోజుకు కోటి డోస్ లను ఇస్తామని వెల్లడించిన కేంద్రం లక్ష్యానికి మాత్రం ఇది చాలా దూరమే. జూన్ లో 1 నుంచి 27వ తేదీ వరకూ 10.8 కోట్ల వ్యాక్సిన్ డోస్ లను పంచారు. ఇక సమీప భవిష్యత్ లో మాత్రం ఇది మరింతగా పెరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఉత్పత్తి అయిన టీకాలన్నీ బయటకు వచ్చేయడం, వ్యాక్సిన్ సంస్థలు కొత్త టీకాల తయారీకి మరింత సమయం కావాలని అంటుండటమే ఇందుకు కారణం.

అయితే, జూన్ 22 నుంచి 26 మధ్య మాత్రం, టార్గెట్ కన్నా అధిక డోస్ లు... అంటే రోజుకు 54 లక్షల నుంచి 65 లక్షల డోస్ లు అందాయి. ఇది టార్గెట్ గా నిర్దేశించుకున్న 40 లక్షల కన్నా అధికమే అయినప్పటికీ, ఇదే వేగం కొనసాగే అవకాశాలు లేవని అంటున్నారు. అయితే, రష్యా తయారు చేసిన స్పుత్నిక్, జైడస్ కాడిలా తయారు చేసిన వ్యాక్సిన్ తదితరాలకు అనుమతులు వస్తే, డిసెంబర్ నాటికి ప్రతి ఒక్కరికీ టీకాలు ఇవ్వాలన్న లక్ష్యానికి దగ్గరగానైనా వెళ్లవచ్చని అంటున్నారు.


More Telugu News