డాక్టర్లూ... మూడో వేవ్‌పై భయాందోళనలు సృష్టించొద్దు: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌

  • భయం కంటే జాగ్రత్తతోనే మహమ్మారికి చెక్‌
  • కట్టడి నిబంధనలే మూడో వేవ్‌కు నివారణ
  • రెండో వేవ్‌పై ఎలా పోరాడాలో చర్చించాలి
  • పీపీపీ వల్లే వైద్యారోగ్య వ్యవస్థ బలోపేతం
  • కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ వ్యాఖ్యలు
కొవిడ్‌ మూడో వేవ్‌ ముప్పుపై ప్రజల్లో భయాందోళనలు సృష్టించొద్దని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ డాక్టర్లు, వైద్య సిబ్బందికి విజ్ఞప్తి చేశారు. ముందు జాగ్రత్త వల్లే మహమ్మారిని రూపుమాపగలమని.. భయంతో కాదని వ్యాఖ్యానించారు. భారత్‌లో ప్రజారోగ్య వ్యవస్థ పటిష్ఠతపై జరిగిన ఓ సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కరోనా కట్టడి నిబంధనల్ని పాటించడం వల్ల మూడో వేవ్‌ ముప్పును సమర్థంగా ఎదుర్కొనగలమని జితేంద్ర సింగ్‌ వ్యాఖ్యానించారు. మూడో వేవ్‌ గురించి మాట్లాడడం మానేసి రెండో దశపై ఎలా పోరాడాలో చర్చించాలని హితవు పలికారు. అలాగే కొవిడ్‌ మహమ్మారి సమయంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్యం(పీపీపీ) బలపడిందని తెలిపారు.

ఇదే వేదికపై మాట్లాడిన ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. ఇప్పటి వరకు కరోనా మూలంగా నేర్చుకున్న పాఠాలతో కొత్త వేరియంట్లను ఎదుర్కొనేందుకు సంసిద్ధం కావాలని సూచించారు. అందులో భాగంగా ప్రజారోగ్య వ్యవస్థను పటిష్ఠం చేయాలన్నారు. అలాగే పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్యాన్ని సైతం మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లలో చాలా వరకు పరిశోధనా సంస్థల నుంచే వచ్చాయని.. పరిశ్రమల నుంచి కాదని తెలిపారు. ఇది పబ్లిక్‌-ప్రైవేట్‌ భాగస్వామ్యం వల్లే సాధ్యమయ్యిందన్నారు.


More Telugu News