టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టనున్న మిథాలీ రాజ్

  • అంతర్జాతీయ క్రికెట్లో 22 ఏళ్లను పూర్తి చేసుకున్న మిథాలీ
  • 22 ఏళ్ల 91 రోజులు ఆడిన సచిన్
  • మరో మూడు నెలలు ఆడితే సచిన్ రికార్డు బద్దలు
ప్రపంచ మహిళల క్రికెట్లో పలు రికార్డులను సొంతం చేసుకున్న తెలుగమ్మాయి మిథాలీ రాజ్ అద్భుతమైన రికార్డును కైవసం చేసుకోబోతోంది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును మిథాలీ బద్దలుకొట్టబోతోంది. అంతర్జాతీయ క్రికెట్లోకి మిథాలి 1999 జూన్ 26న ఆరంగేట్రం చేసింది. ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ తో 22 ఏళ్లను పూర్తి చేసుకుంది.

అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక కాలం ఆడిన రికార్డు టెండూల్కర్ పేరున ఉంది. సచిన్ 22 ఏళ్ల 91 రోజులు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగారు. మరో మూడు నెలల పాటు మిథాలీ క్రికెట్ ఆడితే సచిన్ రికార్డును తిరగరాస్తుంది. ప్రస్తుతం మిథాలీ టీ20లకు గుడ్ బై చెప్పేసింది. కేవలం వన్దేలు, టెస్టులు మాత్రమే ఆడుతోంది. వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ కు ఆడి, క్రికెట్ కు వీడ్కోలు పలకాలనే యోచనలో ఉంది. మిథాలీ కెప్టెన్సీలో భారత మహిళల జట్టు రెండు సార్లు ప్రపంచకప్ ఫైనల్స్ కు చేరింది. ఒకసారి గెలుపు అంచుల వరకు వెళ్లి త్రుటిలో ఓటమిపాలయింది.

ప్రపంచంలో ఇప్పటి వరకు అత్యధిక వన్డేలు ఆడిన మహిళా క్రికెటర్ కూడా మిథాలీనే. 214 వన్డేలు ఆడిన మిథాలి 7 వేలకు పైగా పరుగులను సాధించింది. గత ఆదివారం ఇంగ్లండ్ తో జరిగిన వన్డేలో కూడా ఆమె కీలక ఇన్నింగ్స్ ఆడి, 72 పరుగులు చేసింది.


More Telugu News