భారత మహిళా క్రికెట్ జట్టును చిత్తుగా ఓడించిన ఇంగ్లండ్!

  • ఇరు జట్ల మధ్యా తొలి వన్డే
  • 201 పరుగులకే భారత్ ఆలౌట్
  • 91 బంతులు మిగిలుండగానే ఇంగ్లండ్ విజయం
  • ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా టామీ బ్యూమాంట్
ఇంగ్లండ్ టూర్ లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఘోరంగా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ లో మరో 91 బంతులు మిగిలివుండగానే ఇంగ్లండ్ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేయగా, ఇంగ్లండ్ జట్టు 34.5 ఓవర్లలోనే ఛేదించింది.

భారత జట్టులో ఓపెనర్ స్మృతీ మందాన 10, షఫాలీ వర్మ 15 పరుగులకే అవుట్ కావడంతో, ఆదిలోనే భారత్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఆపై వన్ డౌన్ గా వచ్చిన పూనమ్ రౌత్ 32 పరుగులతో ఫర్వాలేదనిపించగా, కెప్టెన్ మిథాలీ రాజ్ 72 పరుగులు చేసి, స్కోర్ ను ముందుకు దూకించారు. ఆపై వచ్చిన ఎవరూ పెద్దగా రాణించక పోవడంతో జట్టు స్కోరు 201 పరుగులకే పరిమితమైంది.

ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీకి మూడు వికెట్లు దక్కగా, కేథరిన్, అన్యాలు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఆపై 202 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు ఏ దశలోనూ వెనక్కు తిరిగి చూడలేదు. ఓపెనర్ లౌరెన్ విన్ ఫీల్డ్ 16 పరుగులకే అవుట్ అయినప్పటికీ, టామీ బ్యూమాంట్ 87 పరుగులు, నాట్ స్కివర్ 74 పరుగులు చేశారు. కెప్టెన్ హేదర్ నైట్ 18 పరుగులతో నాటౌట్ గా నిలువగా, ఇంగ్లండ్ విజయం సునాయాసమైంది.

భారత బౌలర్లలో జులన్ గోస్వామి, ఏక్తా బిషిత్ లకు మాత్రమే చెరో వికెట్ లభించాయి. మిగతావారెవరూ ఇంగ్లండ్ క్రికెటర్లను ఇబ్బందిపెట్టలేకపోయారు. టామీ బ్యూమాంట్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.


More Telugu News