డిసెంబర్ నాటికి అందరికీ టీకా అనుమానమే!

  • లక్ష్యాన్ని చేరడం అంత సులభం కాదు
  • వ్యాక్సిన్ ఉత్పత్తిని భారత్ బయోటెక్ 9 రెట్లు పెంచాలి
  • తొలి ఆర్డర్ నే పూర్తి చేయలేని స్థితిలో సంస్థ
  • ఇప్పటికే 44 కోట్ల డోస్ లకు ఆర్డర్
  • సరఫరా చేసింది 4 కోట్ల డోస్ లకు లోపే
ఈ ఏడాది చివరకు దేశంలోని అందరికీ కరోనా వ్యాక్సిన్ ను ఇస్తామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ లో పేర్కొనగా, ఈ లక్ష్యాన్ని చేరుకోవడం అంత సులభం కాదని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇండియాలోని జనాభాలో 93 నుంచి 94 కోట్ల మంది పెద్దలున్నారు. వీరందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలంటే, 187 కోట్ల డోస్ లు అవసరం. కనీసం ఈ టార్గెట్ కు దగ్గరగా వెళ్లాలన్నా, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ అత్యంత కీలకం కానుంది.

డిసెంబర్ లోగా కనీసం 48 కోట్ల కొవాక్సిన్ డోస్ లను భారత్ బయోటెక్ సరఫరా చేయాల్సి వుంటుంది. అదే జరగాలంటే, ప్రస్తుతం ఉన్న ఉత్పత్తిని 9 రెట్లు పెంచాల్సివుంటుంది. ఈ సంవత్సరం జనవరిలోనే టీకాల పంపిణీ మొదలు కాగా, ఈ ఆరు నెలల వ్యవధిలో 26 శాతం ప్రజలకే టీకా అందింది. సుమారు 40 కోట్ల డోస్ లు ఇంతవరకూ సరఫరా అయ్యాయి. వీటిల్లో భారత్ బయోటెక్ నుంచి అందింది కేవలం 3.8 కోట్ల డోస్ లు మాత్రమే.

జనవరిలో భారత్ బయోటెక్ కు కేంద్రం నుంచి 8 కోట్ల టీకా డోస్ ల ఆర్డర్ రాగా, అది పూర్తి కావడానికే మరింత సమయం పడుతుందని అంచనా. ఇదే సంస్థ వద్ద ఆగస్టు నుంచి దశలవారీగా 19 కోట్ల డోస్ ల సరఫరాకు కూడా కేంద్రం నుంచి ఆర్డర్ ఉంది. ఆగస్టు నాటికి తొలి ఆర్డర్ ను పూర్తి చేసే పరిస్థితి ప్రస్తుతానికి కనిపించడం లేదు. టీకాల ఉత్పత్తిని మరింత వేగం చేస్తే మాత్రమే లక్ష్యం దిశగా సాగే వీలుంటుంది.

ఇక భారత్ బయోటెక్ కు కేంద్రం ఇప్పటికే 30 శాతం అడ్వాన్స్ నిధులను కూడా అందించింది. ఆగస్టు నుంచి డిసెంబర్ లోగా 40 కోట్ల కొవాక్సిన్ డోస్ లు అందించేందుకు డీల్ కుదిరిందని కేంద్రం తన అఫిడవిట్ లో పేర్కొంది. అంటే ఏడాది చివరకు 44 కోట్ల డోస్ లను భారత్ బయోటెక్ అందించాలి. ఇప్పుడున్న టీకా ఉత్పత్తి సామర్థ్యాన్ని ఒక్కసారిగా 9 రెట్ల వరకూ పెంచడం కూడా కష్టమేనని సమాచారం.


More Telugu News