అది టీపీసీసీ కాదు... టీడీపీ పీసీసీ: రేవంత్ కు పదవి నేపథ్యంలో కోమటిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

  • రేవంత్ రెడ్డికి టీపీసీసీ పదవి
  • తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన కోమటిరెడ్డి
  • మాణికం ఠాగూర్ పీసీసీ పదవిని అమ్ముకున్నారంటూ ఆరోపణ
  • గాంధీభవన్ మెట్లెక్కబోనని శపథం
తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవికి బలంగా వినిపించిన పేర్లలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరు కూడా ఉంది. అయితే, కాంగ్రెస్ అధిష్ఠానం మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి వైపు మొగ్గుచూపింది. ఈ పరిణామాన్ని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ ఇక టీడీపీ పీసీసీగా మారిపోయిందని వ్యంగ్యం ప్రదర్శించారు. టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన నేతలు ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ తనను కలవరాదని స్పష్టం చేశారు. తాను కూడా గాంధీభవన్ మెట్లెక్కబోనని శపథం చేశారు.

పార్టీలు మారిన వారికే పదవులు వస్తున్నాయంటూ టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసులో ఎలా లాబీయింగ్ జరిగిందో, పీసీసీ పదవి విషయంలో అలాగే జరిగిందని అన్నారు. మొదటినుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పీసీసీ పదవిని రాష్ట్ర ఇన్చార్జి మాణికం ఠాగూర్ అమ్ముకున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

కొత్త పీసీసీ కార్యవర్గానికి అభినందనలు తెలుపుతున్నానని, అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికలో డిపాజిట్లు తెచ్చుకోవాలని వ్యంగ్యం ప్రదర్శించారు. పనిచేసే కార్యకర్తలకు కాంగ్రెస్ లో గుర్తింపు లేదన్న విషయం స్పష్టమైందని, కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ టీడీపీలా మారిపోతోందని వ్యాఖ్యానించారు. ఇబ్రహీంపట్నం నుంచి భువనగిరి వరకు పాదయాత్ర చేపడుతున్నానని, అది రేపు ప్రారంభం అవుతుందని కోమటిరెడ్డి వెల్లడించారు.


More Telugu News