జమ్ములో దాడి వెనుక జైషే ఉగ్రసంస్థ కుట్ర?

  • విస్తుగొలిపే విషయాలు తెరపైకి
  • జైషేకు పాక్‌ ఆర్మీ లేదా ఐఎస్‌ఐ సహకారం
  • రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సమీక్షించే అవకాశం
  • డ్రోన్‌ దాడుల వల్ల భవిష్యత్తులో ప్రమాదం
  • ఎవరినీ అరెస్టు చేయలేదన్న ఎన్‌ఐఏ
జమ్ములో భారత వాయుసేన పర్యవేక్షణలో ఉన్న విమానాశ్రయంపై జరిగిన డ్రోన్‌ దాడి ఘటనలో విస్తుగొలిపే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఈ దాడిలో ఉపయోగించిన డ్రోన్‌ కచ్చితంగా పాక్‌ వైపు నుంచి సరిహద్దులు దాటి వచ్చి ఉంటుందని ప్రాథమిక విచారణలో భాగంగా అధికారులు భావిస్తున్నారు.

మరోవైపు ఈ దాడి వెనుక పాక్‌ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్‌ ఉగ్రసంస్థ హస్తం ఉండి ఉంటుందని విచారణలో పాల్గొన్న అధికారులు భావిస్తున్నారు. అయితే, ఇలాంటి దాడి చేయడం జైషే ఉగ్రమూకలకు ఒక్కరికే సాధ్యం కాదని.. పాక్‌ సైన్యం లేదా వారి గూఢచార సంస్థ ఐఎస్‌ఐ నుంచి సహకారం అంది ఉంటుందని అనుమానిస్తున్నారు.

మరోవైపు ఇప్పటి వరకు జరిగిన విచారణ పురోగతి, జమ్ములో తాజా పరిస్థితులపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ త్వరలో సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించనప్పటికీ.. దేశంలో జరిగిన తొలి డ్రోన్‌ దాడి కావడంతో కేంద్రం దీన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ తరహా ఘటనల వల్ల భవిష్యత్తులో మరింత ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు ఆర్మీ చీఫ్‌, రక్షణ మంత్రి లద్దాఖ్‌ పర్యటనకు వెళ్లడానికి కొన్ని గంటల ముందు ఈ దాడి జరగడంతో భద్రతా బలగాలు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.

ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితుల్ని అరెస్టు చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ఎన్‌ఐఏ స్పందించింది. ఇప్పటి వరకు ఎలాంటి అరెస్టులు చేయలేదని స్పష్టం చేసింది. 2016లో పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై జరిగిన భారీ ఉగ్రదాడి తరహాలోనే దీన్ని కూడా  ప్లాన్‌ చేసి ఉంటారని భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. మరోవైపు భద్రతా బలగాలు జమ్ముతో పాటు కశ్మీర్‌ లోయ, లద్దాఖ్‌లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు.


More Telugu News