కిమిడి మృణాళిని ఏ సామాజికవర్గం విజయసాయిరెడ్డీ? ఆమెకు మంత్రి పదవి ఇచ్చింది తెలియదా?: అయ్యన్న

  • కాపులకు మంత్రి పదవి ఇవ్వలేదన్న విజయసాయి 
  • కాపులను ఓటు బ్యాంకులుగా వాడుకున్నారని విమర్శ
  • దీటుగా బదులిచ్చిన అయ్యన్న
  • మైండ్ దొబ్బిందా? అంటూ ఆగ్రహం
పూసపూటి అశోక్ గజపతిరాజు కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో విజయనగరం జిల్లాలో మెజారిటీ వర్గమైన తూర్పు కాపులకు ఒక్క మంత్రి పదవి కూడా లేదని, కాపులను ఓటు బ్యాంకులుగా వాడుకున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు స్పందించారు. కిమిడి మృణాళిని గారు ఏ సామాజిక వర్గం విజయసాయిరెడ్డీ? ఆమెకు మంత్రి పదవి ఇచ్చింది తెలియదా? అని కౌంటర్ ఇచ్చారు.

"మైండ్ ఉందా లేదా? లేక, ఆత్మలతో, దేవుళ్లతో మాట్లాడే ఆ పిచ్చోడితో స్నేహం కారణంగా పూర్తిగా దొబ్బిందా?" అంటూ అయ్యన్న నిప్పులు చెరిగారు. అశోక్ గారు అన్ని వర్గాలను ఆదరించిన సంగతి అందరికీ తెలుసని, కానీ కాపులకు మీరు ఒరగబెట్టిందేమిటి? అని ప్రశ్నించారు.

"కాపులకు చంద్రబాబు ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్ రద్దు చేశారు. కాపు కార్పొరేషన్ నుంచి రూ.800 కోట్లు మళ్లించారు. కాపు కార్పొరేషన్ ద్వారా ఇచ్చే రుణాలు నిలిపివేశారు. కాపు కార్పొరేషన్ కు 5 ఏళ్లలో రూ.10 వేల కోట్ల నిధులు ఇస్తానని, ఇప్పటివరకు రూపాయి ఇవ్వలేదు" అని విమర్శించారు. గోదావరి జిల్లాలో కాపులపై వైసీపీ గూండాల దౌర్జన్యాలు చూస్తున్నామని తెలిపారు.

"కాపు కార్పొరేషన్ ద్వారా 43 వేల మందికి గతంలో చంద్రబాబు ఇచ్చిన రుణాలు రద్దు చేశారు. చంద్రబాబు ఇచ్చిన కాపు రిజర్వేషన్ ను వ్యతిరేకించిన జస్టిస్ ఈశ్వరయ్యకు కీలక పదవి ఇచ్చారు. నువ్వేమో కాపులను ఉల్లిపాయలు అంటావు... మీరా కాపుల గురించి మాట్లాడేది?" అంటూ ఆగ్రహం వెలిబుచ్చారు.


More Telugu News