రోజుకి కోటి మందికి టీకా ఇవ్వడమే లక్ష్యం: ఎన్‌.కె.అరోరా

  • 6-8 నెలల పాటు కోటి మందికి టీకా
  • మూడో వేవ్‌ ఆలస్యమయ్యే అవకాశం
  • ఈలోపు టీకా పంపిణీ చేయాలని లక్ష్యం
  • జులై లేదా ఆగస్టులో జైడస్‌ టీకా
  • వెల్లడించిన కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌
రానున్న ఆరు నుంచి ఎనిమిది నెలలు రోజుకి కోటి మందికి కరోనా టీకాలు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌.కె.అరోరా తెలిపారు. మూడో వేవ్‌ ఆలస్యంగా వచ్చే  అవకాశం ఉన్నట్లు ఐసీఎంఆర్‌ అధ్యయనంలో తేలిందన్నారు. ఈ నేపథ్యంలో అందరికీ వ్యాక్సిన్‌ అందించేందుకు తగు సమయం ఉంటుందన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకొని అందరికీ టీకాలు ఇవ్వాలనుకుంటున్నామన్నారు.

జైడస్‌ క్యాడిలా రూపొందిస్తున్న కరోనా టీకా ప్రయోగాలు దాదాపు పూర్తయ్యాయన్నారు. జులై చివర్లో లేదా ఆగస్టు ప్రారంభంలో 12-18 ఏళ్ల వయసు వారికి టీకా అందజేసే అవకాశం ఉందన్నారు.

మరోవైపు ఈ ఏడాది చివరి వరకు వయోజనులందరికీ కరోనా టీకా ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని కేంద్ర ప్రభుత్వం శనివారం సుప్రీంకోర్టుకు తెలియజేసిన విషయం తెలిసిందే. అలాగే వ్యాక్సిన్లను సమకూర్చుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆసుపత్రులు ఇబ్బందులు ఎదుర్కొంటుండడంతో వ్యాక్సిన్‌ సమీకరణ విధానాన్ని మార్చినట్లు కోర్టుకు విన్నవించింది. దేశంలో ఉన్న 18 ఏళ్లు పైబడిన వారు 93-94 కోట్ల మంది ఉన్నారని.. వారందరికీ కరోనా టీకా ఇచ్చేందుకు 186-188 కోట్ల డోసులు అవసరమని వివరించింది.


More Telugu News