జానాను కలిసిన రేవంత్.. అధిష్ఠానం సరైన నిర్ణయం తీసుకుందన్న మల్లు రవి

  • జానారెడ్డిని కలిసిన అనంతరం షబ్బీర్ ఇంటికి
  • ఏఐసీసీ నిర్ణయాన్ని స్వాగతించిన మల్లు రవి
  • కేసీఆర్ అప్రజాస్వామిక రాజకీయాలు ఎదిరించేందుకు కాంగ్రెస్ నాయకులంతా కలిసి పనిచేయాలని పిలుపు
తెలంగాణ పీసీసీ చీఫ్‌గా ఎన్నికైన రేవంత్‌రెడ్డి గత రాత్రి పార్టీ సీనియర్ నేత, సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డిని కలిశారు. అనంతరం శాననమండలిలో మాజీ ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ నివాసానికి వెళ్లి కలిశారు. రేవంత్ రెడ్డి నియామకంపై పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి మాట్లాడుతూ.. ఏఐసీసీ నిర్ణయాన్ని స్వాగతించారు. రేవంత్‌ను తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించి మంచి నిర్ణయమే తీసుకుందని అన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ అప్రజాస్వామిక రాజకీయాలను ఎదిరించి పోరాడేందుకు కాంగ్రెస్ నాయకులంతా ఏకమై కలిసికట్టుగా పనిచేయాల్సి ఉందని అన్నారు. కాగా, రేవంత్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించిన వెంటనే ఆయన ఇంటి వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న అభిమానులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.


More Telugu News