నకిలీ టీకా కార్యక్రమంలో వ్యాక్సిన్ వేయించుకున్న నటి మిమి చక్రవర్తి.. అస్వస్థత

  • కోల్‌కతా మునిసిపల్ కార్పొరేషన్‌ కమిషనర్ ను అంటూ నటిని నమ్మించిన వ్యక్తి
  • టీకా కార్యక్రమంలో పాల్గొని వ్యాక్సిన్ వేయించుకున్న మిమి చక్రవర్తి
  • ఆమె అస్వస్థతకు టీకానే కారణమని చెప్పలేమంటున్న వైద్యులు
  • నకిలీ టీకా కార్యక్రమంపై సీఎం మమత బెనర్జీ ఆగ్రహం
నకిలీ టీకా కార్యక్రమంలో పాల్గొని టీకా వేయించుకున్న ప్రముఖ నటి, టీఎంసీ ఎంపీ మిమి చక్రవర్తి నిన్న అస్వస్థతకు గురయ్యారు. డీహైడ్రేషన్, కడుపునొప్పితో బాధపడడంతోపాటు ఆమె బీపీ కూడా పడిపోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు పేర్కొన్నారు. అయితే, ఆమె అనారోగ్యానికి టీకానే కారణమని చెప్పడం తొందరపాటు చర్యే అవుతుందని వైద్యులు చెబుతున్నారు.

ఇంతకీ ఏమైందంటే కోల్‌కతా మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా నమ్మించిన దేవాంజన్ దేవ్ అనే వ్యక్తి ఇటీవల నగర సమీపంలో ఓ టీకా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. దీనికి ఎంపీ మిమి చక్రవర్తిని ఆహ్వానించాడు. ప్రజలకు సంబంధించిన విషయం కావడంతో ఈ కార్యక్రమానికి హాజరైన మిమి చక్రవర్తి.. టీకాపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు తాను కూడా వ్యాక్సిన్ వేయించుకున్నారు. అయితే, టీకా వేయించుకున్నప్పటికీ ఎస్సెమ్మెస్ రాకపోవడంతో అనుమానించిన ఎంపీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అది నకిలీ కార్యక్రమమమని తేలింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అది నకిలీ టీకా కార్యక్రమమని తేల్చి దేవాంజన్‌ను అరెస్ట్ చేశారు. దీంతో అతడు పంపిణీ చేసిన టీకాలపైనా అనుమానాలు మొదలయ్యాయి. అదే సమయంలో మిమి అస్వస్థతకు గురికావడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు.

మరోవైపు, దేవాంజన్ నకిలీ టీకా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి మమత బెనర్జీ తీవ్రంగా పరిగణించారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టొద్దని పోలీసులను ఆదేశించారు. దీంతో దేవాంజన్‌పై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.


More Telugu News