భారత్ నుంచి యూఏఈకి తరలిపోతున్న టీ20 వరల్డ్ కప్!

  • షెడ్యూల్ ప్రకారం భారత్ లో జరగాల్సిన ఈవెంట్
  • దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం
  • ఇప్పటికే ఆగిపోయిన ఐపీఎల్
  • యూఏఈకి తరలింపుపై బీసీసీఐ సమీక్ష
  • త్వరలో అధికారిక ప్రకటన
షెడ్యూల్ ప్రకారం భారత్ లో నిర్వహించాల్సిన టీ20 వరల్డ్ కప్ మెగా ఈవెంట్ యూఏఈకి తరలి వెళ్లనుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తాజా సమాచారం ప్రకారం... యూఏఈ గడ్డపై ఈ టోర్నీ అక్టోబరు 17న ప్రారంభం కానుంది. నవంబరు 14న టోర్నీ ఫైనల్ జరగనుంది.  ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొంటాయి. వేదిక మార్పు అంశాన్ని బీసీసీఐ తదుపరి సమావేశంలో ఐసీసీకి నివేదించనుంది. అబుదాబి, షార్జా, దుబాయ్ వేదికల్లో మ్యాచ్ లు నిర్వహించనున్నారు.

ఈ భారీ టోర్నీని భారత్ లో నిర్వహించడానికి బీసీసీఐ విముఖత వ్యక్తం చేయడానికి రెండు ప్రధాన కారణాలున్నాయి. ఇంతటి పెద్ద టోర్నీని నిర్వహిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి బీసీసీఐకి ఎలాంటి పన్ను మినహాయింపులు దక్కకపోవడం ఒక కారణమైతే, ఇటీవల ఐపీఎల్ ఆగిపోవడంతో స్వదేశాలకు వెళ్లిపోయిన విదేశీ ఆటగాళ్లు ఇప్పట్లో భారత గడ్డపై అడుగుపెట్టే పరిస్థితులు లేకపోవడం మరో కారణం.

కాగా, టీ20 వరల్డ్ కప్ వేదిక మార్పు అంశంపై బీసీసీఐ కార్యదర్శి జై షా వివరణ ఇచ్చారు. దేశంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో టోర్నీ తరలింపు అంశాన్ని పరిశీలిస్తున్నామని, ఆటగాళ్ల ఆరోగ్య భద్రతే తమకు పరమావధి అని చెప్పారు. త్వరలోనే అధికారికంగా నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించారు.


More Telugu News