ఏపీ సీఎం జ‌గ‌న్‌కు రఘురామకృష్ణరాజు మ‌రో లేఖ

  • తిరుమలలో స్పెసిఫైడ్‌ అథారిటీ ఏర్పాటు అంశం ప్ర‌స్తావ‌న‌
  • 146 జీవో విడుదల చేయడంపై అభ్యంత‌రాలు
  • దీనిపై రాష్ట్ర ప్రజలు  ఆందోళనకు గురవుతున్నార‌ని వ్యాఖ్య‌
  • ప్రభుత్వ ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకే ఇలా చేస్తున్నార‌ని లేఖ
ఏపీ సీఎం జ‌గ‌న్‌కు వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామ కృష్ణరాజు ఈ రోజు మ‌రో లేఖ రాశారు. నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో ఆయ‌న రాసిన ఈ లేఖ‌లో తిరుమలలో స్పెసిఫైడ్‌ అథారిటీ ఏర్పాటు అంశాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. దాని ఏర్పాటుకి 146 జీవో విడుదల చేయడంపై అభ్యంత‌రాలు తెలిపారు.

దీనిపై రాష్ట్ర ప్రజలు ఆందోళనకు గురవుతున్నార‌ని, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకే ఇలాంటి చర్యలకు పాల్ప‌డ‌డం స‌రికాద‌ని ఆయ‌న అన్నారు. కేవ‌లం ఇద్దరు సభ్యులతో స్పెసిఫైడ్‌ అథారిటీ ఏర్పాటు చేస్తే సమగ్రంగా చర్చించేందుకు  వీలు ఉండ‌ద‌ని ఆయ‌న తెలిపారు.

దేవాదాయ, ధర్మాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగానీ, కమిషనర్‌ గానీ అథారిటీలో సభ్యులుగా ఉంటారని ఆయ‌న గుర్తు చేశారు. తిరుమలలో స్పెసిఫైడ్‌ అథారిటీ విష‌యంలో అలాంటి సంప్రదాయం పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక లోటు నుంచి బయటపడేందుకు బాండ్లను జారీ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంద‌ని చెప్పారు.

ఆ బాండ్లను కనీసంగా రూ.5 వేల కోట్ల మేర  స్పెసిఫైడ్‌ అథారిటీ ద్వారా కొనుగోలు చేస్తారనే అనుమానాలు క‌లుగుతున్నాయ‌ని తెలిపారు. ఈ విష‌యంపై స‌ర్కారు స్పష్టత ఇవ్వాలని ఆయ‌న చెప్పారు. వెంట‌నే కొత్త బోర్డును ఏర్పాటు చేయాలని ఆయ‌న త‌న లేఖ‌లో కోరారు. ప్ర‌భుత్వ చ‌ర్య‌లు  హిందూ ధర్మాన్ని ఆచరించే ప్ర‌జ‌ల‌ నమ్మకాలను దెబ్బ‌తీస్తున్నాయని చెప్పారు.


More Telugu News