పల్లా భూముల కేసు: ఎంపీ విజయసాయి, అధికారులకు హైకోర్టు నోటీసులు

  • తమ భూముల్లో రెవెన్యూ అధికారుల జోక్యాన్ని నిలువరించాలంటూ హైకోర్టుకు పల్లా
  • భూములపై యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశం
  • విశాఖ కలెక్టర్, ఆర్డీవో, గాజువాక తహసీల్దార్ సహా పలువురికి నోటీసులు
విశాఖపట్టణానికి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు భూముల ఆక్రమణ ఆరోపణలకు సంబంధించిన కేసులో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. జిల్లాలోని గాజువాక మండలం తుంగ్లాం గ్రామంలో శ్రీనివాసరావు, ఆయన సోదరుడు పల్లా శంకర్‌రావుకు చెందిన 6.27 ఎకరాల భూమిలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు రెవెన్యూ అధికారులను ఆదేశించింది.

అలాగే ఈ కేసులో ప్రతివాదులైన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, విశాఖ జిల్లా కలెక్టర్, ఆర్డీవో, గాజువాక తహసీల్దార్, స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు నిన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. తమ భూముల్లో రెవెన్యూ అధికారుల జోక్యాన్ని నిలువరించాలంటూ పల్లా సోదరులతోపాటు మరో ఇద్దరు హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన కోర్టు పల్లా భూములపై స్టేటస్ కో పాటించాలని ఆదేశించడంతోపాటు విజయసాయి, ఇతర అధికారులకు నోటీసులు జారీ చేసింది.



More Telugu News