2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీదే విజయం.. జోస్యం చెప్పిన కుమారస్వామి

  • దక్షిణాదిలో కర్ణాటక మినహా జాతీయ పార్టీలను ప్రజలు తిరస్కరించారు
  • బీజేపీవి ద్వంద్వ ప్రమాణాలు
  • అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలంటూ స్పీకర్, గవర్నర్‌కు లేఖలు
2023లో కర్ణాటక అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలపై మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైకమాండ్‌లు ఢిల్లీలో కూర్చుని ఇక్కడ పాలించాలని ప్రజలు కోరుకోవడం లేదని, ఇతర దక్షిణాది రాష్ట్రాల్లానే 2023 ఎన్నికల్లో కర్ణాటకలోనూ ప్రాంతీయ పార్టీనే ప్రజలు గెలిపిస్తారని అన్నారు. దక్షిణ భారతదేశంలో ఒక్క కర్ణాటక మినహా మిగతా రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లను ప్రజలు తిరస్కరించారని అన్నారు. 2023 ఎన్నికల్లో కర్ణాటకలోనూ ఇదే జరిగి తీరుతుందని జోస్యం చెప్పారు.

కర్ణాటకలో జేడీఎస్ ఒక్కటే ప్రధాన ప్రాంతీయ పార్టీ అని కుమారస్వామి పేర్కొన్నారు. మహారాష్ట్రలో రెండు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ.. కర్ణాటకలో మాత్రం సమావేశాలను ఏర్పాటు చేయలేదని, ఇది ఆ పార్టీ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరస్‌ను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, ఈ నేపథ్యంలో రెండు మూడు రోజులైనా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి అన్ని అంశాలపైనా చర్చించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

రాష్ట్రంలో కరోనా పరిస్థితి, ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలు, ఇతర అంశాలపై చర్చించేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరుతూ కర్ణాటక గవర్నర్ వజుభాయి వాలా, స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కాగేరికి కుమారస్వామి లేఖలు రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.


More Telugu News