పాకిస్థాన్ ను గ్రే లిస్టులోనే కొనసాగించాలని ఎఫ్ఏటీఎఫ్ నిర్ణయం

  • 2019 నుంచి గ్రే లిస్టులో పాక్
  • ఎఫ్ఏటీఎఫ్ నిర్ణయం
  • పారిస్ లో ముగిసిన ఎఫ్ఏటీఎఫ్ సమావేశాలు
  • పాక్ అంశంపై సమీక్ష
ఉగ్రవాదులకు, ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకుండా చేయడంలో పాకిస్థాన్ మరోసారి విఫలమైందని పారిస్ కేంద్రంగా పనిచేసే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) వెల్లడించింది. పాకిస్థాన్ ను మరోసారి అత్యధిక నిఘా ఉండే దేశాలతో కూడిన గ్రే లిస్టులోనే కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. పారిస్ లో ఎఫ్ఏటీఎఫ్ సమావేశాలు నేటితో ముగిశాయి. ఉగ్రవాద చర్యలకు నిధులను నియంత్రించడంలో పాక్ మరోసారి విఫలమైందని టాస్క్ ఫోర్స్ గుర్తించింది.

అయితే మునుపటితో పోల్చితే పాక్ తీరు గణనీయంగా మెరుగైందని వివరించింది. 27 అంశాలకు గాను 26 అంశాల్లో పాక్ తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగానే ఉన్నట్టు ఎఫ్ఏటీఎఫ్ అధ్యక్షుడు డాక్టర్ మార్కస్ ప్లీయర్ తెలిపారు.

కాగా, గత మూడేళ్లుగా పాక్ గ్రే జాబితాలో ఉంటోంది. ఈ జాబితాలో ఉన్న దేశాలకు అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలు తీసుకునే వీలుండదు. ఈ జాబితా నుంచి బయటపడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పాకిస్థాన్ కు వరుసగా ఈ ఏడాది కూడా ఆశాభంగం తప్పలేదు.


More Telugu News