రాయలసీమ ఎత్తిపోతల పథకాలను ఏపీ ఉపసంహరించుకోవాలి: తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి

  • ఏపీ, తెలంగాణ మధ్య నీటి యుద్ధం
  • మంత్రుల పరస్పర వాగ్బాణాలు
  • ఏపీ ప్రభుత్వానిది ధిక్కార ధోరణి అన్న జగదీశ్ రెడ్డి
  • తెలంగాణకు వైఎస్సార్ ద్రోహం చేశారని వ్యాఖ్యలు
ప్రాజెక్టుల విషయంలో ఏపీ, తెలంగాణ మంత్రుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఈ అంశంలో తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాలను ఏపీ ఉపసంహరించుకోవాలని స్పష్టం చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాలపై కేంద్రం, అపెక్స్ కమిటీల దృష్టికి తీసుకెళ్లామని వెల్లడించారు. రాయలసీమ ఎత్తిపోతలపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇప్పటికే స్టే ఇచ్చిందని, కానీ ఏపీ ప్రభుత్వం ఎన్జీటీ ఆదేశాలను కూడా ధిక్కరించి ముందుకెళ్లిందని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. ట్రైబ్యునల్ ఆదేశాల ధిక్కరణకు పాల్పడిందంటూ ఏపీపై కేసు కూడా వేశామని తెలిపారు.

ప్రాజెక్టు వద్ద సర్వే మాత్రమే జరుగుతోందని, అన్ని అనుమతులు వచ్చాకే పనులు చేస్తామని ఏపీ అబద్ధాలు చెప్పిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ, తెలంగాణకు ద్రోహం తలపెట్టేలా ఏపీ ప్రాజెక్టు పనులు కొనసాగిస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీరని ద్రోహం చేశారని మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు.


More Telugu News