నారద టేపుల కేసులో మమతకు సుప్రీం కోర్టులో ఊరట

  • అఫిడవిట్లను పున:పరిశీలించాల్సిందిగా కలకత్తా హైకోర్టుకు ఆదేశం
  • జూన్ 29లోగా ఆమోదించాలని ఆదేశాలు
  • బెంగాల్ సర్కార్ అఫిడవిట్లను తిరస్కరించిన హైకోర్టు
నారద టేపుల కేసులో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి సుప్రీం కోర్టు ఊరటనిచ్చింది. బెంగాల్ ప్రభుత్వం తరఫున సీఎం మమత, న్యాయ శాఖ మంత్రి మలాయ్ ఘటక్ లు దాఖలు చేసిన అఫిడవిట్ లను పున:పరిశీలించాల్సిందిగా కలకత్తా హైకోర్టుకు సూచించింది. జూన్ 29లోగా వారు సమర్పించిన అఫిడవిట్లను ఆమోదించాలని ఆదేశించింది. ఈ కేసు విచారణ నుంచి జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ అనిరుద్ధ బోస్ లు తప్పుకొన్న రెండు రోజులకే సుప్రీం కోర్టు ఈ ఆదేశాలను ఇచ్చింది. వారు తప్పుకోవడంతో కేసు విచారణను జస్టిస్ వినీత్ శరణ్ కు సుప్రీం కోర్టు అప్పగించింది.

నారద టేపుల కేసుకు సంబంధించి బెంగాల్ సర్కార్ దాఖలు చేసిన అఫిడవిట్లపై జూన్ 9న కలకత్తా హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ రాజేశ్ బిందాల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. అయితే, ఆ అఫిడవిట్లను సీఎం, న్యాయ శాఖ మంత్రులు చెప్పిన సమయంలోగా దాఖలు చేయలేదని, వాటిని ఇప్పుడు తాము ఇష్టమొచ్చినప్పుడు దాఖలు చేస్తామంటే వాటిని ఆమోదించేది లేదని పేర్కొంటూ ఆ అఫిడవిట్లను తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే మమత బెనర్జీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

వ్యాపారవేత్తగా నటిస్తూ బెంగాల్ లో పెట్టుబడులు పెడతానంటూ 2014లో ఓ జర్నలిస్ట్ చేసిన స్టింగ్ ఆపరేషన్ సంచలనం సృష్టించింది. ఏడుగురు తృణమూల్ పార్టీ ఎంపీలు, నలుగురు మంత్రులు, ఒక ఎమ్మెల్యే, ఓ పోలీస్ అధికారి ముడుపులు తీసుకుంటూ దొరికారు. ఆ టేపులను 2016 అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందే విడుదల చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించాయి.


More Telugu News