ఏపీ ప్రభుత్వంపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ సీరియస్.. సీఎస్ కు హెచ్చరిక!

  • రాయలసీమ ఎత్తిపోతల పథకంపై విచార‌ణ‌
  • పర్యావరణ అనుమతులు లేకుండా ముందుకు వెళ్ల‌కూడ‌ద‌ని గతంలో ఆదేశాలు
  • ఆదేశాలను ఉల్లంఘిస్తూ పనులు చేపడుతున్నారని పిటిష‌న్‌
  • తదుపరి విచారణ వ‌చ్చేనెల‌ 12కి వాయిదా  
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) చెన్నై ధ‌ర్మాస‌నం ఈ రోజు మ‌రోసారి విచార‌ణ జ‌రిపింది. ఏపీ చేప‌ట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో పర్యావరణ అనుమతులు లేకుండా ముందుకు వెళ్ల‌కూడ‌ద‌ని గతంలో ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసిన విష‌యం తెలిసిందే. ఆ ఆదేశాలను ఉల్లంఘిస్తూ పనులు చేపడుతున్నారని తెలంగాణ సామాజిక కార్య‌క‌ర్త‌ గవినోళ్ల శ్రీనివాస్‌ ఎన్జీటీలో ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేయ‌డంతో దీనిపై విచార‌ణ జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా ఏపీ ప్రభుత్వంపై ట్రైబ్యునల్‌ ఆగ్రహం వ్యక్తం చేయ‌డం గ‌మ‌నార్హం. ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా పనులు చేపడితే జైలుకు పంపుతామని ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని హెచ్చరించింది. ఎత్తిపోతల పథకం తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, చెన్నైలోని కేంద్ర పర్యావరణ శాఖ ప్రాంతీయ కార్యాలయాన్ని ఆదేశించింది. ఈ పిటిష‌న్‌పై తదుపరి విచారణను వ‌చ్చేనెల‌ 12కి వాయిదా వేస్తున్న‌ట్లు తెలిపింది.


More Telugu News