ఆఖరికి మహాత్ముడి మాటలనూ వదల్లేదు: ఇందిర ఎమర్జెన్సీ సమయంలో ఏవేవి నిషేధించారో వివరిస్తూ బీజేపీ ఎటాక్​

  • సోషల్ మీడియాలో ప్రచారం
  • భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ సినిమాలు బ్యాన్
  • కిషోర్ కుమార్ పాటలపై నిషేధం
  • అవి చీకటి రోజులన్న ప్రధాని మోదీ
  • వ్యవస్థలను నాశనం చేశారని విమర్శ
ఇందిరా గాంధీ హయాంలో విధించిన అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ)పై బీజేపీ విమర్శలు గుప్పించింది. 1975 నుంచి 1977 మధ్య 21 నెలల పాటు ఇందిరా ఎమర్జెన్సీ రాజ్యం ఎలాంటి ఆంక్షలు విధించిందో ‘‘ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ: భారత ప్రజాస్వామ్యంలో నమ్మలేని దశ’’ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహిస్తోంది. అలాంటి చీకటి రోజులు ఎప్పుడూ రాలేదని వ్యాఖ్యానించింది. ఇటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఎమర్జెన్సీపై కామెంట్ చేశారు. బీజేపీ మొదలు పెట్టిన ప్రచార చిత్రాలను పోస్ట్ చేశారు.

ఆ చీకటి రోజులను ఎప్పటికీ మరిచిపోలేమన్నారు. అన్ని సంస్థలు, వ్యవస్థలను ఓ పద్ధతి ప్రకారం నాశనం చేశారని విమర్శించారు. ప్రజాస్వామ్య విలువలను కాంగ్రెస్ ఎలా భ్రష్టు పట్టించిందో ఎమర్జెన్సీనే ఒక ఉదాహరణ అన్నారు. ఆ ఎమర్జెన్సీపై పోరాటం చేసినవారిని ఎల్లప్పటికీ గుర్తుంచుకుంటామని, దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామని మోదీ అన్నారు.

దేశ ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత పటిష్ఠం చేసేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలన్నారు. రాజ్యాంగం నేర్పించిన విలువలను అందరూ పాటించాలన్నారు.

కాగా, ఎమర్జెన్సీ సమయంలో వేటిపై నిషేధం విధించారో ఇన్ స్టా గ్రామ్ వేదికగా బీజేపీ విమర్శలు గుప్పించింది. ‘‘చంద్రశేఖర్ ఆజాద్ , భగత్ సింగ్ కు సంబంధించిన సినిమాలను నిషేధించారు. ఆఖరుకు కిషోర్ కుమార్ పాటలనూ విననివ్వలేదు. మహాత్మాగాంధీ, రవీంద్ర నాథ్ ఠాగూర్ స్ఫూర్తి వాక్యాలనూ వాడనివ్వలేదు. ఎమర్జెన్సీ సమయంలో వీటన్నింటినీ నిషేధించారంటే నమ్మగలరా?’’ అని పేర్కొంది. 'కాబట్టి మన దేశానికి ఇంత నష్టం చేసిన వారిని మళ్లీ అధికారంలోకి రానివ్వకుండా చేస్తామని ప్రతిజ్ఞ చేయండి' అంటూ పిలుపునిచ్చింది. వాటికి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసింది.      


More Telugu News