జమ్మూకశ్మీర్ నేతలతో ముగిసిన ప్రధాని మోదీ సమావేశం

  • ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసంలో అఖిలపక్షం
  • కశ్మీర్ కు ప్రత్యేక హోదా రద్దు చేశాక తొలి భేటీ
  • 8 పార్టీలకు చెందిన 14 మంది నేతలు హాజరు
  • ప్రధాని ముందు 5 డిమాండ్లు
జమ్మూకశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేశాక తొలిసారి కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఇవాళ ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో ఈ భేటీ జరిగింది. జమ్మూకశ్మీర్ లోని 8 పార్టీలకు చెందిన 14 మంది నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ కీలక భేటీలో పాల్గొన్నారు. కశ్మీర్ నుంచి నేషనల్ కాన్ఫెరెన్స్ నాయకులు ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ, కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, మరోనేత అల్తాఫ్ బుఖారీ తదితరులు ఈ సమావేశానికి విచ్చేశారు.

దాదాపు 3 గంటల పాటు జరిగిన ఈ అఖిలపక్ష భేటీ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. అనంతరం గులాం నబీ ఆజాద్ మీడియాతో మాట్లాడుతూ, జమ్మూకశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని ప్రధానిని కోరామని అన్నారు. రాష్ట్ర హోదా పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నట్టు ప్రధాని చెప్పారని ఆజాద్ వివరించారు. ప్రధాని ముందు 5 డిమాండ్లు ఉంచామని చెప్పారు. రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని, కశ్మీర్ లోయలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ఎన్నికలు నిర్వహించాలని, కశ్మీరీ పండిట్లకు పునరావాసం కల్పించాలని, రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, జమ్మూకశ్మీర్ ప్రజల భూ హక్కులకు భద్రత కల్పించాలని కోరినట్టు ఆజాద్ వెల్లడించారు.

అల్తాఫ్ బుఖారీ స్పందిస్తూ, నేతలు చెప్పిన విషయాలను ప్రధాని సావధానంగా విన్నారని వెల్లడించారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే ఎన్నికలు అని ప్రధాని తెలిపారని బుఖారీ పేర్కొన్నారు. పునర్విభజన ప్రక్రియలో భాగస్వాములు కావాలని ప్రధాని కోరారని తెలిపారు.


More Telugu News