కారులో సీఎం ఉండగానే... ఎస్పీ, సెక్యూరిటీ అధికారుల కొట్లాట!

  • హిమాచల్ ప్రదేశ్ లో ఘటన
  • రాష్ట్రానికి నితిన్ గడ్కరీ రాక
  • స్వాగతం పలికేందుకు బయల్దేరిన సీఎం
  • సెక్యూరిటీ అధికారి చెంప చెళ్లుమనిపించిన ఎస్పీ
  • ఎస్పీని కాలితో తన్నిన మరో సెక్యూరిటీ అధికారి
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వస్తుండడంతో ఆయనకు స్వాగతం పలికేందుకు సీఎం జైరాం ఠాకూర్ వెళుతుండగా, ఓ ఎస్పీ, ఇద్దరు సీఎం సెక్యూరిటీ అధికారులు సహనం కోల్పోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. తొలుత ఎస్పీ గౌరవ్ సింగ్ ఓ సెక్యూరిటీ అధికారి చెంపపై కొట్టారు. ఇంతలో ఇతర పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది అక్కడకు చేరుకుని పరిస్థితి చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. అంతమంది మధ్యలో ఎస్పీ తన చెంప చెళ్లుమనిపించడాన్ని జీర్ణించుకోలేని ఆ సెక్యూరిటీ అధికారి తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు.

ఇంతలో మరో సెక్యూరిటీ అధికారి వచ్చి ఆ ఎస్పీని కాలితో తన్నాడు. దాంతో ఆ ఎస్పీ సెక్యూరిటీ అధికారి దాడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అంతలో సిబ్బంది వారిద్దరినీ శాంతపరచడంతో ఉద్రిక్త వాతావరణం సద్దుమణిగింది. కాగా, ఈ గొడవ జరుగుతున్న సమయంలో సీఎం జైరాం ఠాకూర్ కారులో ఉన్నారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన హిమాచల్ ప్రదేశ్ డీజీపీ విచారణకు ఆదేశించారు. ఈ కొట్లాటకు సంబంధించిన దృశ్యాలున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.




More Telugu News