మహారాష్ట్రలో మళ్లీ పెరుగుతున్న కేసులు!

  • కరోనాతో మహారాష్ట్ర అతలాకుతలం
  • రెండో వేవ్‌ నుంచి కోలుకుంటున్న రాష్ట్రం
  • నిబంధనల సడలింపుతో జనసమ్మర్ధం
  • మూడో వేవ్‌ తప్పదని నిపుణుల హెచ్చరిక
  • రెండు రోజుల్లో 3,500 కేసుల పెరుగుదల
కరోనాతో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందుంది. అయితే, రెండో వేవ్‌ నుంచి ఆ రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇటీవలే కఠిన లాక్‌డౌన్‌ నుంచి ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. మార్కెట్లు రద్దీగా కనిపిస్తున్నాయి. దీంతో పరిస్థితి ఇలాగే కొనసాగితే మూడో వేవ్‌ తప్పదని.. అంచనాల కంటే ముందే మహమ్మారి మహారాష్ట్రను కుదిపేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు.

అయితే, నిపుణులు చెప్పిన మాటలు నిజమేనన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. గత రెండు రోజులుగా రోజువారీ కేసుల్లో పెరుగుదల నమోదవుతోంది. సోమవారం 6,270 కేసులు వెలుగులోకి రాగా.. మంగళవారానికి అవి 8,470కి పెరిగాయి. నేడు అవి 10,066కి ఎగబాకాయి. దీంతో మరోసారి రాష్ట్ర యంత్రాంగంలో ఆందోళన మొదలైంది.

అన్‌లాక్‌ పేరిట నిబంధనలు సడలిస్తున్న కొద్దీ బహిరంగ ప్రదేశాల్లో రద్దీ పెరిగి కేసులు భారీ స్థాయిలో విజృంభించే అవకాశం ఉందని సీఎం ఉద్ధవ్‌ థాకరే నేతృత్వంలోని కమిటీ ఇటీవలే హెచ్చరించింది. మరోవైపు ఓ మ్యాథమేటికల్‌ మోడల్‌ ఆధారంగా చూస్తే రెండు వేవ్‌ల మధ్య 100-120 రోజుల వ్యవధి ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు.


More Telugu News