ఆగస్టు నాటికి ఐరోపాలో 90 శాతం కేసులు డెల్టా వేరియంట్‌ వల్లే!

  • పిల్లలపై అధిక ప్రభావం
  • ఆల్ఫా రకం కంటే 60% అధిక సంక్రమణ
  • వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయడమే మార్గం
  • రెండో డోసు తక్కువ వ్యవధిలో ఇవ్వాలి
  • అంచనా వేసిన ఈసీడీసీ
ఆగస్టు చివరి నాటికి ఐరోపాలో నమోదయ్యే కరోనా కేసుల్లో దాదాపు 90 శాతం డెల్టా వేరియంట్‌ కేసులే ఉండే అవకాశం ఉందని ‘యూరోపియన్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ ప్రివెన్షన్‌ అండ్‌ కంట్రోల్‌ (ఈసీడీసీ) వెల్లడించింది. వేగంగా వ్యాపించే లక్షణం ఉన్న ఈ వేరియంట్‌ వేసవిలో విస్తృతంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని అంచనా వేసింది. ముఖ్యంగా వ్యాక్సినేషన్‌ పరిధిలో లేని పిల్లలపై అధిక ప్రభావం ఉండే అవకాశం ఉందని పేర్కొంది.

ఆల్ఫా వేరియంట్‌తో పోలిస్తే డెల్టా రకానికి 40-60 శాతం అధిక సాంక్రమిక సామర్థ్యం ఉందని ఈసీడీసీ అంచనా వేసింది. ఆగస్టు ప్రారంభం నాటికి ఐరోపా ప్రాంతంలో 70 శాతం కేసులు.. అదే నెల చివరకు 90 శాతం కేసులు డెల్టా వేరియంట్‌ వల్లనే నమోదు కానున్నాయని తెలిపింది.

దీన్ని అడ్డుకోవాలంటే వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించింది. ఈయూ ప్రాంతంలో ఇప్పటి వరకు 80 ఏళ్లు  పైబడిన వారిలో 30 శాతం.. 60 ఏళ్లు పైబడిన వారిలో 40 శాతం మందికి ఇంకా పూర్తి స్థాయిలో టీకాలు అందాల్సి ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో రెండో డోసు వీలైనంత తక్కువ వ్యవధిలో ఇవ్వాలని సూచించింది.


More Telugu News