15 నెలల తర్వాత హైద‌రాబాద్‌లో పట్టాలెక్కిన ఎంఎంటీఎస్​ రైళ్లు

  • గ‌త ఏడాది క‌రోనా విజృంభ‌ణ ప్రారంభ‌మైన నేప‌థ్యంలో నిలిచిన రైళ్లు
  • ప్ర‌స్తుతం 10 రైళ్ల సేవలు ప్రారంభం
  • ఉదయం గం.7.50 నుంచి రాత్రి 7.05 గంటల వరకు సేవ‌లు
  • విద్యార్థుల పాస్‌లు పొడిగింపు
గ‌త ఏడాది క‌రోనా విజృంభ‌ణ ప్రారంభ‌మైన నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లో నిలిచిపోయిన ఎంఎంటీఎస్ రైళ్లు దాదాపు 15 నెల‌ల త‌ర్వాత ప్రారంభ‌మ‌య్యాయి. ప్రస్తుతం 10 రైళ్ల సేవలు ప్రారంభ‌మ‌య్యాయ‌‌ని దక్షిణ మధ్య రైల్వే ప్ర‌క‌టించింది. ఈ రైళ్లు ప్ర‌తి రోజు ఉదయం గం.7.50 నుంచి రాత్రి 7.05 గంటల వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

అలాగే, విద్యార్థుల పాస్‌లు పొడిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రైళ్ల‌లో క‌రోనా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్లు వివ‌రించారు. ప్రయాణికుల రద్దీని బట్టి క్రమంగా సర్వీసులు పెంచుతామని తెలిపారు. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని చెప్పారు. కాగా, గ‌త ఏడాది మార్చి 23 నుంచి ఎంఎంటీఎస్ రైళ్లు నిలిచాయి.

2003 ఆగస్టు నుంచి ఎంఎంటీఎస్ రైళ్లు సికింద్రాబాద్-లింగంపల్లి, హైదరాబాద్-లింగంపల్లి మధ్య 29 కిలోమీటర్ల మేర సేవ‌లు అందిస్తున్నాయి. 2014లో 15 కిలోమీటర్ల మేర‌ సికింద్రాబాద్-ఫలక్‌నుమా మ‌ధ్య సేవ‌లు ప్రారంభ‌మ‌య్యాయి. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో 26 స్టేషన్లలో ఎంఎంటీఎస్  రైళ్ల సేవ‌లు అందుతున్నాయి.  


More Telugu News